మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ఘటనపై సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు(22) తన సమీప బంధువైన మూడేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు.

By Kalasani Durgapraveen  Published on  2 Nov 2024 1:52 PM IST
మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ఘటనపై సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు(22) తన సమీప బంధువైన మూడేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను చంపేసి పూడ్చిపెట్టాడు. రాత్రి బాగా పొద్దుపోయినా బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. చుట్టుపక్కలా గాలించినా పాప ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. రేపు మధ్యాహ్నం హోం మంత్రి బాధిత కుటుంబానికి చెక్కును అందజేయనున్నారు.

ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడ్ని కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్టు చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం అన్నారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటనపై సత్వరమే విచారణ జరిపి నిందితులకి శిక్ష పడేలా చేస్తామని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.


Next Story