టీటీడీ ఆధ్వర్యంలో గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు
Cleft Lip and Cleft Palate surgeries Under TTD. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో మంగళవారం నుండి ఉచితంగా గ్రహణమొర్
By Medi Samrat Published on 13 Sept 2022 8:22 PM ISTటీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో మంగళవారం నుండి ఉచితంగా గ్రహణమొర్రి (Cleft Lip and Cleft Palate surgery) శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణమూర్తి, బర్డ్ ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఝాన్సీ నేతృత్వంలో తొలిరోజు ఐదుగురికి విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు.
మూడు నెలల వయసు దాటిన చిన్నారుల నుంచి ఏ వయసు వారికైనా గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. దేశంలోని ఏ ప్రాంతంవారికైనా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడంతోపాటు రవాణా ఛార్జీలు కూడా అందిస్తారు. గ్రహణమొర్రి బాధితులకు కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల ఇతర వ్యాధులు కూడా ఉండే అవకాశముంది. శస్త్రచికిత్సల సమయంలో జరిపే పరీక్షల్లో ఇలాంటి వ్యాధులు గుర్తిస్తే వాటికి కూడా ఉచితంగా చికిత్సలు చేస్తారు.
చెవుడు, మూగవారికి కూడా ప్రత్యేకంగా ఆపరేషన్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రహణమొర్రి శస్త్రచికిత్సల కోసం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 7337318107 నంబరుకు ఫోన్ చేసి ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీకార్డుతో అవసరం లేకుండా పేద, ధనిక తేడా లేకుండా అవసరమైన వారందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తారు. ప్రతినెలా 100కు తగ్గకుండా శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి తెలిపారు.