బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి తో కలిసి ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.
పరకామణి భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం తిరుమలలో నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి రూ.23 కోట్లు విరాళంగా అందించిన దాత మురళీకృష్ణను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన విపిఆర్ విశ్రాంతి గృహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.