తిరుపతిలో లీలామహల్‌ సర్కిల్‌లో టైరు పేలి అదుపు తప్పిన ఓ కారు.. జనంపైకి దూసుకెళ్లింది. అదుపు తప్పిన కారు దూసుకురావడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహ అనే వ్యక్తి కొత్త కారును కొన్నాడు. కారును షోరూమ్‌ నుండి బయటకు తీసిన తర్వాత.. లీలామహల్‌ సర్కిల్‌ వైపుగా ఉన్న తన ఇంటికి కారులో పయనమయ్యాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ దగ్గర కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న జనాలు, వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. కారు దూసుకు రావడాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా అక్కడి నుండి పరుగులు తీశారు. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇద్దరికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కారు యజమాని ఘటన జరిగిన తర్వాత తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story