తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం ముగించుకుని తిరిగి వెళుతున్న ఇద్దరు భక్తులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని అరక్కోణం తాలుకా మిట్టపిట్టై గ్రామానికి చెందిన నటరాజన్, మునిరత్నం బైక్‌పై తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన 30వ మలుపు వద్దకు రాగానే వారి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావంతో నటరాజన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే పోలీసులకు, టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. మునిరత్నంను అంబులెన్స్‌లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.