తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం ఏప్రిల్ 10న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 12,320 కిలోల బియ్యం వేలానికి సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి రూ.590/- డిడి తీసి టెండరు షెడ్యూల్ పొందవచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి. ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని ఫోన్ నెంబర్ 0877-2264429, సదరు నంబర్ తో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org సంప్రదించగలరు.
ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం మార్చి 24వ తారీఖు నుండి అమలులోకి వచ్చింది. మార్చి 25వ తారీఖున మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ కారణంగా మార్చి 25వ తేదిన వీఐపీ బ్రేక్ దర్శనం కొరకు మార్చి 24వ తారీఖున ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు. అయితే మార్చి 30వ తేదీన శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో మార్చి 29వ తారీఖున ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ స్పష్టం చేస్తోంది.