తిరుమలలో శనివారం జరుగనున్న రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలవుతాయని తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయన్నారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భద్రతా ఏర్పాట్లను టీటీడీ సివిఎస్వో నరసింహకిషోర్, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన మండపం, మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్నప్రసాదాల పంపిణీ కోసం చేపట్టిన ప్రవేశమార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.