తిరుమల ఘాట్ రోడ్లపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. మూడు వారాల వ్యవధిలో నాలుగో ప్రమాదం చోటుచేసుకుంది. రెండో ఘాట్ రోడ్డులో తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఓ టెంపో వాహనం కొండను ఢీకొట్టింది. ఓ బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. సేఫ్టీ వాల్, రెయిలింగ్ లేకపోవడంతో టెంపో నేరుగా కొండను తాకింది. ప్రమాద సమయంలో టెంపోలో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. కొండను ఢీకొట్టిన నేపథ్యంలో టెంపో ముందుభాగం ధ్వంసమైంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 70,160 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 38,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.