శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన భాగ్యం ఎప్పుడంటే..?
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 11:42 AM IST
శ్రీవారి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాపలాక్‌డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించింది. లాక్‌డౌన్ 5.0లో మరిన్ని నిబంధనలకు సడలింపులను కేంద్రం ప్రకటించిన వేళ.. శ్రీవారి ఆలయాన్ని జూన్ 8 నుంచి తెరిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
దేశ వ్యాప్తంగా ఆలయాలు తెరిచేందుకు అనుమతించిన నేపథ్యంలో ఈ మేరకు తితిదే(తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వెంటనే దర్శనాలు ప్రారంభించనున్నారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. భక్తుడికి, భక్తుడికి మధ్య కనీసం మీటర్‌కు పైగా భౌతిక దూరం ఉండేలా నిత్యం పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. క్యూలైన్లను జిగ్ జాగ్ చేశారు. అలిపిరి, కాలి నడక మార్గాల్లో భక్తులకు వైద్య పరీక్షలు చేసిన తరువాతనే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు.
ఆదివారం నుంచి హైదరాబాద్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయించనున్నారు. హిమాయత్ నగర్ లోని టీటీడీ కేంద్రానికి ఇప్పటికే 40 వేల లడ్డూలు చేరుకున్నాయి. స్వామివారి దర్శనాలు నిలిచిన నేపథ్యంలో లడ్డూలను అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల వ్యవధిలో 13 లక్షల లడ్డూలను విక్రయించారు.