యాక్షన్ లోకి వస్తున్న టిమ్స్.. సేవలు ఎప్పటి నుంచంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2020 7:47 AM GMT
యాక్షన్ లోకి వస్తున్న టిమ్స్.. సేవలు ఎప్పటి నుంచంటే?

తెలంగాణలో మహమ్మారి విస్తరణ అంతకంతకూ పెరుగుతోంది. ఒక రోజుకు వంద కేసులు నమోదు అయ్యాయంటేనే వామ్మో..అని హడలిపోయిన స్థాయి నుంచి ఒక రోజులో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యే వరకూ విషయం వెళ్లిపోయింది. ఇప్పుడందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మొన్నటివరకూ అక్కడో.. ఇక్కడో అంటూ కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి.. ఇప్పుడు పక్క బజారు.. వెనుక బజారు.. పక్క ఇళ్లవరకూ మహమ్మారి వచ్చేసిన పరిస్థితి.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే.. రానున్న రోజుల్లో మరింత పెరగటం ఖాయం. అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు లేవన్న మాట తరచూ వినిపిస్తోంది. గాంధీలో జాగా ఉన్నా.. అత్యవసరమైతే వాడుకోవటానికి వీలుగా కాస్త ఖాళీ పెట్టుకుంటున్నారు. ఇలాంటివేళలోనే.. గచ్ఛిబౌలిలో సిద్ధం చేసిన టిమ్స్ ను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో పదిహేను వందల పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. నిజానికి ఈ ఆసుపత్రి ఎప్పుడో రెఢీ అయినా.. ప్రారంభించలేదు. కేసుల తీవ్రత బాగా పెరిగినతర్వాత అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇప్పుడు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. టిమ్స్ ను సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

టిమ్స్ లో సేవలు అందజేసేందుకు వీలుగా 499 పోస్టుల భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు అర్హుల్ని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. టిమ్స్ ను ఓపెన్ చేస్తున్నారంటే.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నట్లే. సో.. అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లే.

Next Story