భారత్ బ్యాన్ తో టిక్ టాక్ కు రోజుకు నష్టం ఎంత?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 5:09 AM GMT
భారత్ బ్యాన్ తో టిక్ టాక్ కు రోజుకు నష్టం ఎంత?

భారత్ - చైనా మధ్య నడుస్తున్న తాజా ఉద్రిక్తతతో రణతంత్రాన్ని సరికొత్తగా నిర్వచిస్తూ మోడీ సర్కారు 59 యాప్ లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. భారత చట్టాల్ని ఉల్లంఘించేలా సదరు యాప్ లు ఉన్నట్లుగా తేల్చటంతో సదరు యాప్ లతో పాటు.. చైనా సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ యాప్ ను భారత సర్కారు బ్యాన్ చేయటంపై టిక్ టాక్ అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. న్యాయపోరాటానికి దిగుతామని చెప్పింది.

దేశంలోని కోట్లాది మంది మొబైల్ ఫోన్లలో కనిపించే టిక్ టాక్ ను కేంద్రం బ్యాన్ చేయటం ద్వారా ఆ కంపెనీ రోజువారీగా ఎంత ఆదాయం కోల్పోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్యాన్ చేసిన 59 యాప్ లలో టిక్ టాక్ దేశంలో బహుళ ఆదరణ పొందింది. ఈ యాప్ కు ఉన్న మొత్తం కస్టమర్లలో భారత్ నుంచే 30 శాతం మంది వినియోగదారులు ఉండటమే కాదు.. దాని ఆదాయంలో పదిశాతం భారత్ కారణంగానే వస్తోందట. దీంతో.. బ్యాన్ షాక్ టిక్ టాక్ కు భారీగా తాకింది.

ఇంతకీ నిషేధం కారణంగా టిక్ టాక్ కు జరిగే రోజువారీ నష్ఠం ఎంతన్న విషయంలోకి వెళితే.. తమపై భారత సర్కారు తీసుకున్న చర్య కారణంగా రోజుకు రూ. 3.5 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లుగా టిక్ టాక్ తెలిపింది. ఈ ఆర్థిక నష్టంతో పాటు.. చైనాను దారికి తేవాలంటే ఏం చేయాలన్న దానిపై ప్రపంచానికి భారత్ ఆదర్శమైతే.. చైనా సంగతి అంతేనన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటికే మాయదారి రోగాన్ని ప్రపంచానికి అంటించిన వైనంతో.. పలు దేశాల ప్రజలు మహా గుర్రుగా ఉన్నారు. ఇలాంటివారంతా చైనాపై చర్యలకు భారత్ మాదిరి చేపట్టాలని డిమాండ్ చేయటం మొదలైతే.. చైనాకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ కారణంతోనే.. భారత్ నిర్ణయాన్ని బ్యాన్ ఎదుర్కొంటున్న సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Next Story
Share it