వణికించిన నాల్గో సింహం..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 17 July 2020 4:46 PM GMTతౌనాజమ్ బృందా.. మణిపూర్ పోలీస్ అఫీసర్. పశ్చిమ ఇంపాల్ ఎస్పీగా సేవలందిస్తోంది. వృత్తిపై ఎనలేని గౌరవం తనకు. నిబద్ధతకు మారు పేరు ఈ పోలీస్ ఆఫీసర్. వంటిపై ఉన్న ఖాకీ దుస్తుల గౌరవం నలగకుండా పోరాడుతున్న లేడీ టైగర్. ఈ కనిపించే నాల్గో సింహం ఏకంగా మణిపూర్ మాఫియా పవర్కు ఎదురొడ్డి నిలబడింది. మాఫియా అవ్యవహారాల్లో సంబందం ఉందని భావించిన ఖోసీ జౌను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో అన్నివైపుల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకుని నిబ్బరంగా ఉంటోంది. తను చేసిన పని సరైనదేనని నిరూపించుకోడానికి అన్ని ప్రయత్నాలు పట్టు వదలకుండా చేస్తోంది.
సరిగ్గా రెండేళ్ల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బృందా ఇంపాల్ లో పోలీసు అధికారిణిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో జరుగుతున్న చీకటి వ్యాపారాలపై నిఘా వేసింది. మాదకద్రవ్యాల దందా నానాటికీ పెచ్చరిల్లి పోతోంది. సమాజంలో కొందరు డాన్ ల మారి ప్రభుత్వ పెద్దల అండదండలతో రెచ్చిపోతున్నారు. ఈ హై ప్రొఫైల్ వ్యక్తులు చేస్తున్న చీకటి వ్యాపారానికి అడ్డూ అదుపే లేదు. ఫలితంగా రాష్ట్రంలో యువత మత్తు బారిన పడి చెడు దోవ పట్టే ప్రమాదముందని భావించింది.
తదనుగుణంగా కార్యరంగంలో దూకి ఓ డ్రగ్ డాన్ ఖోసి జౌను అరెస్ట్ చేసింది. కొద్ది సేపటికే సినిమాటిక్ గా ఓ పోన్ వచ్చింది...హలో నువ్ ఎవరిని అరెస్ట చేశావో తెలుసా? తరవాతి పరిణాలు తట్టుకోగలవా? అతణ్ణి వెంటనే వదిలేయ్...ఇదీ ఆ ఆగంతక ఫోన్ సారాంశం. యస్ సర్...అలాగే సర్ అనేసి ఉంటే బృందా నలుగురిలో నారాయణమ్మగా మిగిలిపోయేది. కానీ తను అలా వదిలేసే రకం కాదు. ఖాకీ పవర్ పై కొండంత నమ్మకం. చేస్తున్న పని సరైనది అని అనుకుంటే ఎవరు అడ్డొచ్చినా లెక్కచేయని వ్యక్తిత్వం ఆమె సొంతం. అయితే ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. సినిమా కష్టాలు షురు అయ్యాయి.
కేసు ఎత్తేయాలని.. ఖోసీ జౌ ను వదలి పెట్టాలని అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. సాధారణంగా ఇంత దాకా వచ్చాక రాజీ మార్గం అయినా ఉంటుంది...రాజీనామా మార్గం అయినా ఉంటుంది. అయితే బృందా కుంగిపోలేదు.. లొంగిపోలేదు. లేడీ సింగంలా నిఠారుగా నిలుచుంది. పోరాడితే పోయేదేమీ లేదని నిశ్చయించుకుంది. రెండేళ్ల కిందట బృందా చండేల్ లోని అటానమస్ జిల్లా ఛైర్మన్ గా ఉంటున్న ఖోసి జౌ పై అనుమానంతో తనకు లభించిన సమాచారంతో ఆయన ఇంట్లో బృందా సోదాలు నిర్వహించింది.
తన అనుమానాలను నిజం చేస్తూ నాలుగున్నర కిలోల హెరాయిన్ పౌడర్.. 2,80,200 వరల్డ్ ఈజ్ యువర్స్ టాబిలెట్లు, రూ.57,18000 నగదు , రూ,95,000 పాత కరెన్సీ పట్టుబడ్డాయి. బృందా వెంటనే నార్కోటిక్ డ్రగ్స్ చట్టం కింద ఖోసీ జౌతోపాటు మరో ఏడుగురు అనుమానితుల్ని అరెస్ట్ చేసింది. అనుమానితులను విచారించగా డ్రగ్స్ ఎక్కడెక్కడ దాచారో తెలిపారు. వారిచ్చిన సమాచారంలో లాంపెల్ లోని ఏడీసీ సభ్యుడి ఇంట్లో కూడా ఉన్నట్టు తెలిసింది. అక్కడికి కూడా పోవడానికి బృంద సిద్ధపడింది. వెళ్లింది కూడా. అక్కడ్నుంచే ఒత్తిళ్ల పర్వం ప్రారంభమైంది.
ఈ వ్యవహారంలో సాక్షాత్తు మణిపాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఎన్. బీరెన్ సింగ్ కేసుకు సంబంధించి డిపార్ట్ మెంట్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు బృందా ప్రధాన ఆరోపణ. రెండేళ్లుగా ఈ ఒత్తిళ్లు ఎదుర్కొని చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈనెల 13న మణిపూర్ హైకోర్టుకు ఒక అఫడివిట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసు వివరాలు, గత రెండేళ్ల డిపార్ట్ మెంట్ , తను ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు ...ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందో, జోక్యం ఉందో సవివరంగా వివరించింది.
అఫిడవిట్లో అసలు కథ :
పోలీస్ ఆఫీసర్ బృందా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో రెండేళ్ల నాటి సంగతులన్నీ పూసగుచ్చినట్టు వివరించింది. ప్రభుత్వంలోని పెద్దలు తనపై ఎలాంటి ఒత్తిళ్లు తెస్తున్నారో కూడా వివరించింది. డ్రగ్స్ తో దొరికిన వ్యక్తి ముఖ్యమంత్రి భార్యకు కావల్సిన వాళ్లని.. చూసీ చూడనట్టుగా వదిలేయాలని బెదిరించారు. నేను అసలు తగ్గలేదు. చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇంటికి పిలిపించి చివాట్లు పెట్టడంతో బాధేసిందని అఫిడవిట్లో కుండబద్దలు కొట్టినట్టు తెలిపింది. ఇప్పుడా అఫిడవిట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లందరు బృందాకు మనోధైర్యం పలికారు. ఆమె నిజాయతీకి మద్దతుగా నిలిచారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఖోసి జౌకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం. ఈ పరిణామంతో దెబ్బతిన్న బృంద ఫేస్ బుక్ వేదికగా తన నిరసనను బాహటంగా వ్యక్త పరిచింది. ఇప్పడు సమాజంలో బలమైన శక్తులతో పోరాడుతున్న ఆఫీసరుగా ముద్ర వేసుకుంటున్న బృంద పనితీరుకు మెచ్చుకున్న ప్రభుత్వాలు గతంలో ఆమెకు శౌర్యపతకం, ముఖ్యమంత్రి ప్రశంసా పత్రం బహూకరించారు.
ఈ విషయంగా మీడియా ముఖ్యమంత్రి బిరన్ సింగ్‌ను సంప్రదించగా.. న్యాయస్థానంలో ఉన్న ఈ అంశంపై తాను స్పందించలేనని, అది సబ్ జ్యుడీస్ అవుతుందని అన్నారు. న్యాయస్థానంలో ఉన్న అంశాల గురించి ఎవరూ జోక్యం చేసుకోరని న్యాయం జరిగేదాకా చట్టం తనపని తాను చేసుకుపోతుందని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతునే ఉంటుందని స్పష్టం చేశారు. ఏది ఏమైనా బృందా చేపట్టిన ప్రతి చర్యా సాహసోపేతమని పబ్లిక్ పొగుడుతున్నమాట నిజమే గానీ... ఈ పరిణామ క్రమాలు ఆమెను ఎంతగా రాటుదేలుస్తాయో వేచి చూడాల్సిందే!