ఫేస్‌బుక్‌లో సూరత్ లేడీ ఎల్ఆర్ ఆఫీసర్ ఆవేదన.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 July 2020 11:08 AM GMT
ఫేస్‌బుక్‌లో సూరత్ లేడీ ఎల్ఆర్ ఆఫీసర్ ఆవేదన.!

ఆరోజు నిర్భయ కాండ-2 జరిగేదని వ్యాఖ్య

ఈ సమయానికి నాకోసం మీరంతా క్యాండిల్స్ పట్టుకునేవారన్న సునీత

గుజరాత్ లోని సూరత్ లో ఎల్ ఆర్ ఆఫీసర్ గా పనిచేస్తుంది సునీత యాదవ్. ఎల్ ఆర్ ఆఫీసర్ గా ఉంటూనే ఐపీఎస్ అధికారి స్థాయికి ఎదగాలన్నది ఆమె ఆకాంక్ష. కానీ ఓ రాత్రి తన జీవితాన్ని మార్చేసింది. వెరసి తాను ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఫేస్ బుక్ లైవ్ ద్వారా తెలిపింది.

జులై 9వ తేదీ రాత్రి సూరత్ లో కర్ఫ్యూ విధుల్లో ఉన్న సునీత యాదవ్ నిబంధనలను ఉల్లంఘించి బయటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఆపారు. వారు సరైన కారణాలు చెప్పకపోవడంతో చాలా సేపటి వరకూ రోడ్డుపైనే నిలిపివేశారు. కొద్దిసేపటికి గుజరాత్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కొడుకు ఆ ఇద్దరి యువకుల కోసం అక్కడికి రాగా..అతడిని సునీత యాదవ్ నిలదీశారు. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తి తీసిన ఒక వీడియో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైంది. ఆ వీడియో చూసిన సునీత యాదవ్ ఫేస్ బుక్ వేదికగా అసలేం జరిగిందో చెప్పుకొచ్చారు.

తాను సోషల్ మీడియాలో చెప్తున్నట్లుగా కానిస్టేబుల్ ను కాదని, కేవలం ఎల్ఆర్ ఆఫీసర్ ను మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే ఆరోజు అక్కడేం జరిగిందో ఎవరికీ తెలియదన్నారు. నిజానికి జరిగిన సంఘటనలో 10 శాతం మాత్రమే మీడియాకు తెలుస్తుంది కానీ అసలు జరిగిందేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయరని వాపోయారు. ఆరోజు తనతో మరొక పోలీస్ ఉండి ఉండకపోతే నిర్భయ కాండ-2 జరిగేదని చెప్పారు సునీత యాదవ్. అదే జరిగితే ఈ సమయానికి మీరంతా న్యాయం కోసం కొవ్వొత్తులు పట్టుకుని నిరసనలు చేసేవారన్నారు.

అధికారం ఉంది కదా అని తమ లాంటి కిందిస్థాయి ఉద్యోగుల పట్ల కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి అమ్మాయిలు పోలీస్ డిపార్ట్ మెంట్ లో చాలా మందే ఉన్నారన్నారు. తన భవిష్యత్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు రెండ్రోజుల క్రితం ఫేస్ బుక్ లైవ్ లో తెలిపారు. కానీ మున్ముందు తాను అనుకున్న ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించి.. తన సత్తా ఏంటో అందరికీ చూపిస్తానన్నారు. సునీత యాదవ్ ఫేస్ బుక్ లైవ్ తర్వాత జాతీయ స్థాయి మీడియాలు ఆమెను ఇంటర్వ్యూ చేశాయి.

Next Story
Share it