సేవ.. ఆమె ఎంచుకున్న తోవ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sept 2020 5:46 PM ISTచదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం చేయాలా? ఏదైనా సామాజిక సేవలో పాల్గొనాలా? అన్న సందేహం రజియా షేక్‌కు వచ్చింది. అయితే దాని గురించి ఆమె కొండంత ఆలోచిస్తూ కూర్చోలేదు. కేవలం క్షణాల వ్యవధిలో నిర్ణయం తీసేసుకుంది. సేవలోనే కొనసాగాలని నిశ్చయించుకుని టాటా సంస్థ నిర్వహిస్తున్న రామకృష్ణ శారదా సేవాశ్రమంలో చేరిపోయింది. సమాజం గురించి ఆలోచించడం మాట అటుంచి.. పక్క ఇంటి వారికి కష్టమొచ్చినా ఆ మనకెందుకులే అనుకునే వారు కోకొల్లలు. కానీ సమాజంలో ఇతరులకు సేవ చేయాలనే ఆశించే వారూ లేకపోలేదు అనడానికి రజియా ప్రత్యక్ష ఉదాహరణ.
చత్తీస్‌గఢ్ జగదల్పూర్‌లో పుట్టిన రజియాకు చిన్ననాటి నుంచి చదువు అంటే విపరీతమైన ఇష్టం. విజయవాడలో మైక్రోబయాలజీ చేసింది. చదువు తర్వాత ఆశ్రమంలో చేరాక.. తన ప్రాంతంలోని గిరిజనుల జీవన విధానం.. ముఖ్యంగా గిరిజన మహిళలకు పోషకాహారం తదితరాంశాలపై పరిశోధించింది. ఉపాధి అవకాశాలు అంతంత మాత్రమే ఉన్న ఆ ప్రాంతంలో పురుషులు కచ్చితంగా వలస వెళ్ళాల్సిందే.
అయితే గిరిజన స్త్రీలు పొలాల్లోనో తోటలోనో పనిచేస్తుంటారు. గిరిజన యువకులు తీవ్రవాదాలవైపు ఆకర్షితులవు తుంటారు. పురుషులు ఖాళీ దొరికినప్పుడల్లా ఇప్పసారా తాగుతుంటారు. రజియా మొదట్లో గిరిజన మహిళల పోషకాహారానికి సంబంధించి చాలా వర్క్‌షాపులు నిర్వహించింది. మంచి పౌష్టికాహారం తోపాటు పాలు పండ్లు తీసుకోవాల్సిందిగా వర్క్‌షాపులో రజియా తెలిపేది. అయితే పేదరికంలో మగ్గుతున్న వారికి ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి? ఈ సందర్భంలోనే వారికోసం ఏదైనా చేయాలని రజియా అనుకుంది.
ఓసారి జగదల్పూర్‌లో వర్క్‌షాపు చేస్తున్నప్పుడు గిరిజన మహిళల్ని పౌషకాహారం ఏం తీసుకుంటారని అడిగింది రజియా. అప్పుడు వారు మొహ్వా లడ్డు గురించి చెప్పారు. ఇప్పపూలతో ఈ లడ్డును తయారు చేస్తుంటారు. అయితే ఇప్పపూలు సారాకు వాడుతుంటారు కదా మరి లడ్డు చేస్తే మత్తు ఎక్కుతుందే తప్ప పౌష్టికం ఎక్కడుంటుంది అనుకుంది. అయితే గిరిజన సంస్కృతిలో ఇప్ప పూలను ఆరాధిస్తారు.
ఈ నేపథ్యంలో ఇప్పపువ్వు గురించి వివరాలు సేకరించింది. ఆ పూలలో చాలా పోషకపదార్థాలుంటాయని తెలిసింది. అప్పుడే రజియాకు ఒక ఆలోచన తట్టింది. తను మొహ్వా లడ్డూలను తయారు చే యించి విక్రయిస్తే అది గిరిజన మహిళలకు ఉపాధిలా మారుతుంది కదా అనిపించింది.
అయితే మరో చిక్కు పడింది. ఈ మొహ్వా లడ్లు చాలా కాలం నిలువ ఉండవు. కేవలం నాలుగు రోజులుంటే ఎక్కువ. ఆ తర్వాత లడ్డును ఫుడ్ ల్యాబొరెటరీకు తీసుకెళ్ళి పరీక్షించి ప్రయోగాలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఎలాంటి ప్రిజర్వేటరీలు వాడకుండానే లడ్డూలను నెలలపాటు తాజాగా ఉంచవచ్చని తేలింది. అయితే నిర్ధిష్ట ఉష్ణోగ్రతలో, శుభ్రమైన నీటితో ఇప్ప పువ్వుల్ని శుభ్రపరిస్తే ఇది సాధ్యమని తేలింది.
అయితే అనుకున్న వెంటనే చేసేటంత సులువైన పనికాదు. లడ్డుల తయారీకి లైసెన్స్ కావాలి. మార్కెటింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ ఆకర్షకంగా ఉండాలి.. ఇవన్నీ కావాలంటే కనీస పెట్టుబడి ఉండాలి. అయితే మహిళలకు ఉపాధి కల్పించినట్లుంటుందన్న భావనతో పెట్టుబడి కోసం అధికారుల చుట్టూ రజియా తిరిగింది. కానీ ఎవరూ స్పందించకపోగా ఎందుకీ తలనొప్పి అన్నట్టు మాట్లాడారు.
ఇక లాభం లేదని రజియా పది మంది గిరిజన మహిళల్ని ఓ బృందంగా చేసుకుని కమనార్‌లో మొహ్వా లడ్డూల తయారీ ప్రారంభించింది. దీనికోసం మహిళలు జైమా అంబే పేరిట ఓ స్వయం సహాయక గ్రూపుగా ఏర్పడ్డారు. అదే పేరుతో లడ్ల విక్రయం ప్రారంభించారు. అయితే మొదట్లో ఎక్కువ మంది కొనలే దు. వ్యాపారం మందకొడిగా సాగింది. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందా అని రజియా బెంగపడేది. అయితే క్రమంగా ఆ పరిస్థితి నుంచి బైట పడగలిగారు. మార్కెట్ పుంజుకుంది.
మొహ్వా లడ్డూలకు గిరాకీ పెరిగింది. డిల్లీ ఇతర ప్రధాన నగరాల్లో ఉత్సవాలు, ఎగ్జిబిషన్ల సమయంలో ఈ లడ్లను ప్రమోట్ చేసేందుకు రజియా కృషి చేసింది. ప్రస్తుతం వందమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. బస్తర్ ఫుడ్స్ ద్వారా లైసెన్సనింగ్, ప్యాకింగ్ తదితర సహాయాలు ఆయా బృందాలకు అందజేస్తున్నారు. అంతే కాదు ఎటు పోవాలో ఏం చేయాలో తెలీక తీవ్రవాదానికి మళ్ళుతున్న యువతను ఉపాధి బాట పట్టించడానికి రజియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మొదట్లో ఈ లడ్డూలు అమ్మేదెలారా దేవుడా అనే దశ నుంచి ప్రస్తుతం ఈ డిమాండ్‌కు సరిపడా తయారీ ఎలారా దేవుడా అనుకునే దశకు చేరుకున్నారు. ఆన్‌లైన్ అమ్మకాల్లో బస్తర్ ఫుడ్‌కు మంచి గిరాకీ ఏర్పడింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా తదితర పెద్ద నగరాల్లో ఈ బ్రాండ్ మంచి పేరు సంపాదించుకుంది. నీతి అయోగ్ విమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా –2019 పురస్కారాల జాబితాలో రజియా పేరు చేరింది.
ఉన్నంతలో సేవ చేయడం.. సాటి వారికి సాయ పడటం వినడానికి చాలా చిన్నగా అనిపించినా వీటిని సాధించడానికి చాలా దూరమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. షేక్ రజియా ఈ దూరప్రయాణంలో అలసట పొందలేదు.. నిరాశ చెందలేదు.. తను ఏ లక్ష్యాన్ని అయితే చేరాలనుకుందో దాన్ని తప్ప మరో ఆలోచనను తన మనసులో రానీలేదు. ఫలితమే నేటి విజయం. ఇది రజియా విజయమే కాదు మన్నెం మహిళల విజయం.. వారి ఆర్థిక స్వావలంబన విజయం!!