అడవిని శోధిస్తూ.. అనుకున్నవి సాధిస్తూ..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  1 Sep 2020 11:30 AM GMT
అడవిని శోధిస్తూ.. అనుకున్నవి సాధిస్తూ..!

మలైకా వజ్‌ చిన్నప్పటి నుంచే తన లక్ష్యాలపై శ్రద్ధ చూపింది. అందరితోపాటు స్కూలుకు వెళ్ళినా.. అందరికంటే భిన్నంగా ఆలోచించడం నేర్చుకుంది. లక్ష్యాన్ని సాధించే విభిన్నమార్గాల్లో ప్రయాణించేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం వైల్డ్‌లైఫ్‌ ఫిల్మ్‌ చిత్రీకరణలో గ్రీన్‌ ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయింది. ఒక అడుగు నుంచి మొదలైన మలైకా వజ్‌ ప్రయాణం నిరంతరం నిరంతరాయంగా సాగిపోతోంది. ఉరిమే ఉత్సాహమే కాదు.. అవని అంత సహనాన్ని సొంత చేసుకున్న 22 ఏళ్ళ మలైకా విజయగాధ ఇదీ..

గోవాలోని శాలిగావ్‌లో పుట్టిన మలైకా వజ్‌.. తన ఇంటికి దగ్గరగా సముద్రం ఉండటంతో దాంతో చాలా స్నేహం చేసింది. వీలు దొరికిన ప్రతి క్షణం తన కళ్ళను అనంత సాగరం వైపే మళ్ళించింది. ఆ సముద్రం తనతో ఎన్నో కథలు చెప్పేది. తనలోని రహస్యాలను పంచుకునేది. అలాగే నిత్యం సముద్రంలోకి వెళ్ళే వారిని చూస్తుంటే తనకు అలా సముద్రంలో వెళ్ళాలనిపించేది. అందుకే పద్నల్గేళ్ళ వయసులోనే విండ్‌ సర్ఫింగ్‌ నేర్చుకుంది. జాతీయస్థాయిలో పోటీ పడింది. అక్కడితో మలైకా తపన ఆగిపోలేదు. వెంటనే స్కూబా డైవింగ్‌ నేర్చుకుంది. పదిహేనో ఏట అంటార్కిటా చూసొచ్చింది. తన పదాహారేళ్లకే ఖండాలను చుట్టేసింది.

ఎన్ని ఉన్నా చదువు చాలా ముఖ్యమని తల్లిదండ్రులు భావించి మలైకా వజ్‌ను డిగ్రీలో చేర్పించారు. అయితే ఆ తరగతి గదులు ఆమెకు చాలా ఇరుకనిపించాయి. సాటి విద్యార్థులు కాలేజీలైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటే, తను మాత్రం ఏదో లోకంలో వచ్చినట్లు అలా ఉండిపోయింది. ఇష్టం లేని పనులు ఎలా చేస్తారు? ఎన్నాళ్ళని చేస్తారు? మలైకా తన మనసు చెప్పినట్లు వినే అమ్మాయి. అందుకే డిగ్రీ చదువుకు మంగళం పాడేసింది.

అయితే అందరినీ తన బాటలో నడవమని మలైకా అనడం లేదు. చదువు అందరికీ అవసరమే. అయితే అకడెమిక్‌ చదువుతో సరిసమానమైన చదువు వేరే చోట దొరికినపుడు అది చేయడంలో తప్పేం లేదని అంటోంది. సంప్రదాయ చదువులే చదువులు అనడం సరికాదని ఆమె అభిప్రాయం. బెంగళూర్‌లో ఫెలిస్‌ క్రియేషన్స్‌ సంస్థలో వైల్డ్‌లైఫ్‌ పరిశోధకురాలిగా చేరింది. అంతకు ముందు అంటార్కిటా చూసినపుడే మలైకాకు వైల్డ్‌లైఫ్‌ పిల్మ్‌ మేకింగ్‌పై మనసు మళ్ళింది. ఇప్పుడు దానికో దారి ఏర్పడింది.

అప్పటి నుంచే మలైకా అసలు జీవితం ప్రారంభమైంది. పెద్ద పెద్ద వైల్డ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. వారితో కలిసి పనిచేస్తున్నప్పుడు మెళకువలు తెలుసుకుంది. 2016 లో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఎక్స్‌ప్లోరర్‌ గ్రాంట్‌ను దక్కించుకోగలిగింది. ఈ గ్రాంట్‌తో మూడు పార్ట్‌లలో లివింగ్‌ విత్‌ ప్రిడేటర్స్‌ సీరీస్‌ ప్లాన్‌ చేసింది. ఈసీరీస్‌లో ఆసియా ప్రాంతంలో సింహాలు, పులులు ఇతర జంతువుల్ని గిరిజనులు ఎలా పరిర క్షించుకుంటారో చూపిస్తున్నట్లు మలైకా వివరించారు.

గతంలో ఈ గిరిజనులంటే అటవీ జంతువలకు శత్రువలనే భావన ఉండేది. అయితే వీరికి సరైన ఆయుధాలు, స్వతంత్రం ఇవ్వగలిగితే.. అటవీ పుత్రులే జంతువుల అసలైన రక్షకులుగా ఉంటారని ఈ సీరీస్‌లో చూపాలన్నదే నా తాపత్రయం అని మలైకా అంటోంది.

M2

గత సంవత్సరం మలైకా డిస్కవరీ ఛానెల్, అనిమల్‌ పానెట్‌ తో కలిసి ఆన్‌ది బ్రింక్‌ పేరిట ఓ సీరీస్‌కు మలైకా పనిచేసింది. మనదేశంలో అంతరించి పోతున్న జీవులు హిమాలయాల్లోని ఎలుగుబంటి, బట్టమేక పిట్ట మొదలైన వాటిని చూపించారు. దేశంలో విభిన్న పక్షులు,జంతువులు ఉండటంతో పర్యావరణ వైవిధ్యం సాధ్యమవుతోంది. ఈ వైవిధ్యాన్ని అందంగా చూపించేందుకు ప్రయత్నించారు.

మూడేళ్ల కిందట బెంగళూరు కేంద్రంగా అన్‌టేమ్డ్‌ ప్లానెట్‌ సంస్థను నిత్యే సూద్‌తో కలిసి మలైకా ప్రారంభించింది. వీరు తీసిన పెంగ్‌ యూ సై డాక్యుమెంటరీ ఈ ఏడాది జులైలో గ్రీన్‌ ఆస్కార్స్‌గా పిలిచే జాక్సన్‌ వైల్డ్‌ మీడియా అవార్డ్స్‌కి నామినేట్‌ అయింది. ఇది అటవీజంతువుల స్మగ్లింగ్‌ సంబంధించిన డాక్యుమెంటరీ. బంగాళాఖాతాలో కనిపించే మాంటా రేస్‌ అనే సముద్రజీవుల వాజాను చైనా సంప్రదాయ ఔషధాల తయారీలో వాడుతారు. వీటిని మయన్మార్‌ మీదుగా హాంకాంగ్,చైనాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ఈ మాఫియా చర్యల్ని డాక్యుమెంటరీలో చాలా చక్కగా చూపించారు.

పర్యావరణ మార్పులపై గళమెత్తిన 16 ఏళ్ళస్వీడెన్‌ పర్యావరణవేత్త గ్రేటాపై వార్తల్లో చాలా విమర్శలు వస్తున్నాయి. అయితే మలైకా మాట్లాడుతూ.. అసలు గ్రేటా చాలా చక్కని ఆలోచనలున్న అమ్మాయి. ఆమెను విమర్శించేవారు ఆ పరిధి నుంచి బైటకొచ్చి ఆలోచిస్తే.. తను చేస్తున్న గొప్ప పనులేంటో తెలుస్తాయి. ఆమె తన చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణోద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళుతోంది. ఒక గ్రేటాయే కాదు ఆమెలా చాలా మంది పర్యావపరణ పరిరక్షకులు అనామకంగా ఉన్నారు.

వారి గురించి, వారు చేస్తున్న పనుల గురించి ప్రచారాలు చేసుకునేందుకు సరైన వేదిక లభించడం లేదు వారికి. ఒకటి మాత్రం నిజం మా తరం వాళ్లు ఇలాంటి చాలా కథలను తవ్వి తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ముద్దొచ్చే జంతువులను, ఆహ్లాదంగా ఉండే అడవుల్ని చూసి ఆనందించే రకం కాదు మేము. వాటికి ఏమవుతుందో అని ఆలోచించే తరం మాది. ఈ విషయంగా విధాన నిర్ణయాలు చేసేవారు, డాక్యుమెంటరీ తీసేవాళ్లు, పరిశోధకులు, విద్యార్థులు అందరూ ఏకమై కదలాల్సిన సమయం వచ్చేసింది’ అంటూ భావోద్వేగంగా మలైకా చెబుతోంది.

మలైకాలా విభిన్నంగా ఆలోచించేవారు.. ఆన్వేషించేవారు మన దేశంలో చాలా మందే ఉన్నారు. వారికి కావల్సిందల్లా తమ అభిరుచిని గుర్తెరిగి ప్రోత్సహించే వేదికలు.. అలాంటి వేదికల్ని నిర్వహిస్తున్న పెద్దలు. ఈ ఆశయాలు ఆలోచనలు మున్ముందు ఆరోగ్యవంతమైన తరం నిర్మాణమవడానికి కచ్చితంగా తోడ్పడుతుంది.

Next Story