పీపీఈ సూట్లతో వచ్చి బంగారాన్ని ఎత్తుకుని వెళ్లిపోయారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2020 3:28 PM IST
పీపీఈ సూట్లతో వచ్చి బంగారాన్ని ఎత్తుకుని వెళ్లిపోయారు..!

సతారా, మహారాష్ట్ర : దొంగతనాలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో చేస్తూ ఉంటారు. సినిమాల ప్రభావమో ఏమో కానీ కొందరు వాహనాలను తీసుకుని రావడం, ముఖాలకు మాస్కులు వేసుకుని మారణాయుధాలతో లోపలికి దూసుకుని వెళ్లడం.. బెదిరించి కావాల్సినవి లాక్కొనో, ఉన్నదంతా ఊడ్చుకునో వచ్చిన వాహనాల్లో చెక్కేస్తూ ఉంటారు. ఇవన్నీ అచ్చం సినిమా సీన్ల లాగే మనకు అనిపిస్తూ ఉంటాయి. అందుకే సినీ ఫక్కీలో దొంగతనాలు చేస్తున్నారు అని చెబుతూ ఉంటారు.

తాజాగా మహారాష్ట్రలో ఓ దొంగతనం చోటుచేసుకుంది. ఆ దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్లు ధరించిన సూట్లే ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచాయి. హెల్త్ కేర్ విభాగం వాడుతున్న పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పిపిఈ)తో ఆభరణాల దుకాణంలోకి ప్రవేశించిన ఆగంతుకులు 780 గ్రాముల బంగారాన్ని తీసుకుని వెళ్లిపోయారు.

పోలీసులు ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆభరణాల షాపులో ఉన్న సిసిటివి ఫుటేజీని గమనించగా దొంగలు షోకేసుల్లోనూ, కప్ బోర్డుల్లోనూ ఉన్న బంగారాన్ని తీసుకుని వెళ్లారు. దొంగలు క్యాప్స్, మాస్కులు, ప్లాస్టిక్ జాకెట్లు వేసుకోవడమే కాకుండా చేతికి గ్లవుజులు కూడా ఉన్నాయి. వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బంది వాడే పిపిఈ కిట్ ను ధరించి వచ్చారని పోలీసులు తెలిపారు. ఆభరణాల షాపు యజమాని స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 78 తులాల బంగారం పోయిందని కంప్లైంట్ లో తెలిపారు. షాపులో ఉన్న గోడను బద్దలు కొట్టుకుంటూ వచ్చి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Next Story