బోగస్‌ ఫించన్‌ల ఏరివేత.. జీవన పత్రాల సేకరణ

By అంజి  Published on  21 Dec 2019 5:24 AM GMT
బోగస్‌ ఫించన్‌ల ఏరివేత.. జీవన పత్రాల సేకరణ

ముఖ్యాంశాలు

  • రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా ఫించన్‌ పరిశీలన
  • నెల నెలా ఫించన్‌ తీసుకుంటున్న 39,14,194 మంది
  • ఫించన్‌ లబ్దిదారులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
  • అనర్హులను జాబితా నుంచి తొలగిస్తున్న అధికారులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో బోగస్‌ ఫించన్‌ల ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఫించన్‌ తీసుకుంటున్న వారిలో చాలా మంది అనర్హులని అధికారులు గుర్తిస్తున్నారు. ఆసరా ఫించన్‌కు అనర్హులైన వారిని ప్రభుత్వం ఆ జాబితా నుంచి తొలగిస్తోంది. కాగా కరీంనగర్‌, హైదరాబాద్‌లోనే ఎక్కువగా అనర్హ ఫించన్‌దారులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో అధికారులు జరిపిన ఆసరా ఫించన్‌ల పరిశీలనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొందరు 1154 ఏళ్ల క్రితమే మరణించారని, వారికి కూడా నెల నెలా ప్రభుత్వం ఫించన్‌ అందుతునట్లు అధికారులు తెలిపారు. ఆసరా ఫించన్‌ పరిశీలనలో భాగంగా ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు ఫించన్‌ లబ్దిదారుల ఇళ్లను స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారు. ఫించన్‌దారుల ఇళ్లను పరిశీలిస్తున్న అధికారులు.. వారు బతికే ఉన్నారా?, వేరే చోట ఉన్నారా అన్న వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత నమోదు చేసుకున్న వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. ఫించన్‌కు అనర్హులైన వారిని ఆ జాబితా నుంచి తొలగిస్తున్నారు.

సోమ, మంగళవారం నాటికే రాష్ట్రంలో 7,681 చనిపోయిన్నట్టు అధికారులు గుర్తించారు. ఇవాళ్టితో ఆసరా ఫించన్‌ల పరిశీలన ప్రక్రియ ముగియనుంది. గురువారం నాటికి 26వేల మందికిపైగా మృతి చెందినవారు, మూడు నెలలుగా ఫించన్‌ తీసుకోవడం లేదని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 39,14,194 మంది నెల నెలా ఫించన్‌ తీసుకుంటున్నారు. వృద్ధులు 12,75,444 మంది, దివ్యాంగులు 4,97,813 మంది, వితంతువులు 14,49,512 మంది, నేత కార్మికులు 37,436 మంది, గీత కార్మికులు 62,950 మంది, హెచ్‌ఐవీ బాధితులు 33,168 మంది, బోదకాలు బాధితులు 14,370 మంది, బీడీ కార్మికులు 4,08,505 మంది, ఒంటరి మహిళలు 1,34,990 మంది ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లబ్దిదారులు తపాలా కార్యాలయాల ద్వారా, బ్యాంకుల ద్వారా ఫించన్‌ తీసుకుంటున్నారు. తపాల కార్యాలయాల్లో వేలిముద్ర తీసుకొని అధికారులు ఫించన్‌ ఇస్తారు. వరుసగా మూడు నెలలు ఫించన్‌ తీసుకోనివారిని వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. బ్యాంకుల్లో ఇలాంటి వెసులుబాటు లేకపోవడంతో లబ్దిదారులకు నెలా నెలా డబ్బు సంబంధిత బ్యాంక్‌లో జమ అవుతోంది. ఈ నేపథ్యంలో అదికారులు బ్యాంక్‌ ద్వారా ఫించన్‌ తీసుకుంటున్న వారిపై దృష్టి పెట్టారు. బ్యాంకుల ద్వారా 17.42 లక్షల మంది ప్రతి నెలా ఫించన్‌ తీసుకుంటున్నారు.

Next Story