లాక్‌డౌన్ పొడగింపా? ఆంక్షలా?.. 9 తరువాత స్పష్టత వచ్చే అవకాశం..
By Newsmeter.Network Published on 6 April 2020 3:03 PM ISTకరోనా వైరస్ బుసలు కొడుతోంది.. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న ఈ మహమ్మారి భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపుతోంది. బుసలు కొడుతున్న కరోనా కోరలు విరిచేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఏరోజుకారోజు పాజిటివ్ కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.. అయినా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 4వేలు దాటింది. వీరిలో 50కిపైగా మృత్యువాత పడ్డారు. ఇదిలాఉంటే కరోనా మహమ్మారిని భారత్‌లో వ్యాప్తి చెందకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మీడియాలో సందేశాలు ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందకుండా ఒకరోజు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన ప్రధాని.. అది విజయవంతం కావటంతో.. వెంటనే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మోదీ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలుసైతం తోడవ్వడంతో.. లాక్ డౌన్ దిగ్విజయంగా సాగుతుంది. ఈనెల 14వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది.
Also Read : ఎట్టకేలకు నెగిటివ్ వచ్చింది..
గత వారం వరకు భారత్‌లో కరోనా వ్యాప్తి అంతగా లేదని, ఉండబోదని అందరూ భావించారు. పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే కూడా అందరిలోనూ అదే అభిప్రాయం ఏర్పడింది. కానీ పాజిటివ్ కేసులు వారం రోజుల్లో 4వేలకు చేరువయ్యాయి. మార్చి 30వరకు అనుకున్న దానికంటే ముందే లాక్‌డౌన్ ముగుస్తుందని భావించినా.. ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో లాక్‌డౌన్ గడువు పెంచుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.
Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…
దీంతో లాక్‌డౌన్ పొడగింపు, ముగింపు విషయంపై ఈనెల 9న స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లాక్‌డౌన్‌పై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ఎత్తివేసి 15 నుంచి ఆంక్షలు విధిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అధికశాతం మంది వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆంక్షలు పెడితే ఏఏ రంగాలకు ఆంక్షలు విధించాలి, ఏఏ రంగాలకు ఆంక్షలు ఎత్తివేయాలి వంటి విషయాలపై చర్చసాగుతుందని పలువురు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తానికి 8న కేంద్రం పెద్దలు లాక్‌డౌన్ పొడగింపు, నిలిపివేతపై ఓ అవగాహన వస్తారని, 9న స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే లాక్‌డౌన్ పొడగింపుపై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, లాక్‌డౌన్ గడువు పొడగింపు, నిలిపివేత వంటి అంశాలపై కేంద్ర పెద్దల వద్ద ఎలాంటి చర్చలు రాలేదని, 9 నుంచి 12లోపు కేంద్రం నుంచి ఓ నిర్ణయం వెలువడుతుందని బీజేపీలోని పలువురు నేతలు పేర్కొంటున్నారు.