కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే...

By Newsmeter.Network  Published on  5 April 2020 2:41 AM GMT
కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే...

కరోనా వైరస్‌.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ వంటి దేశాలనుసైతం కోలుకోలేని దెబ్బతీసిన ఈ కరోనా మహమ్మారి.. భారత్‌లోనూ వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14వరకు లాక్‌డౌన్‌ విధించింది. ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టడి చేస్తోంది.. ఫలితంగా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది. అయినా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.

Also Read :కుమార్తె మృతి.. వీడియో కాల్‌లోనే అంత్యక్రియలు వీక్షించిన తండ్రి

ఈ వైరస్‌ సోకిన వారిలో జలుబు, జ్వరం, పొడిదగ్గు, ఆయాసం మాత్రమే లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం కళ్ల కలకలు కనిపించినా కరోనాగా అనుమానించాల్సిందేనని వైద్యులు పేర్కొంటున్నారు. కళ్ల కలకలతో పాటు జ్వరం ఉంటే ఇక కరోనా వైరస్‌ వైఫైలా మీ వెంట ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తొలిసారిగా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తిలో కళ్ల కలకలు కూడా వచ్చాయంట. చైనాలోని వుహాన్‌ నగరంలో తొలుత కళ్ల కలకతో వచ్చిన వ్యక్తిలో కరోనా వైరస్‌ ఉన్నట్లు ఓ వైద్యుడు గుర్తించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం తొలుత కొట్టిపారేసినా.. తర్వాత పరిస్థితి తీవ్రమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కళ్ల కలకతో పాటు జ్వరం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read :12 తరువాతే నిర్ణయం తీసుకుంటాం

సరోజనీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం ఈ విషయంపై ఓ తెలుగు ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ప్రభావం నేత్రాలపైనా ఉంటుందని చెప్పారు. సాధారణంగా కళ్ల కలకలు వైరస్‌ ద్వారా వచ్చి కొద్దిరోజులు ఉండి తగ్గిపోతాయని, అయితే కరోనా వైరస్‌తో వచ్చే కలకలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. కళ్ల కలకతో పాటు జ్వరం ఉంటే 90శాతం కరోనా ఉన్నట్లు అనుమానించి శాంపిళ్లు సేకరించి పరీక్షించాలని తెలిపారు. సరోజనీదేవి ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓపీ నిర్వహిస్తున్నామని, శనివారం 40మంది వివిధ నేత్ర సమస్యలతో రాగా ఇందులో నలుగురు కళ్ల కలకతో బాధపడుతున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. వారిలో జ్వరం, ఇతర లక్షణాలు లేకపోవడంతో సాధారణ చికిత్స చేసి పంపించామని, 14 రోజులపాటు ఇంటి వద్దే ఉండాలని వారికి సూచించినట్లు రాజలింగం పేర్కొన్నారు.

Next Story