కుమార్తె మృతి.. వీడియో కాల్‌లోనే అంత్యక్రియలు వీక్షించిన తండ్రి

By Newsmeter.Network  Published on  4 April 2020 9:13 AM GMT
కుమార్తె మృతి.. వీడియో కాల్‌లోనే అంత్యక్రియలు వీక్షించిన తండ్రి

కరోనా మహమ్మారి ప్రభావం ఎంతోమంది జీవితాలను దుర్భరంగా మారుస్తుంది. ఎందరికో చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించింది. గత నెల 24 నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఈ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని కేంద్రం సూచించింది. దీనికితోడు రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. ఇదే సమయంలో కన్న కుతురు చనిపోతే ఆమె అంత్యక్రియలకు పాల్గొనలేని పరిస్థితి ఓ తండ్రికి ఎదురైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాక్‌డౌన్‌తో అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం లేకపోవటంతో వీడియో కాల్‌ ద్వారా కుమార్తె అత్యక్రియలను వీక్షించి ఆ తండ్రి కన్నీటి పర్యాంతమయ్యాడు.

Also Read : 12 తరువాతే నిర్ణయం తీసుకుంటాం

జిగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూరుకు చెందిన పాలాజీ భాస్కర్‌, సునీతలకు సాహిత్య(11) ఏళ్ల కుమార్తె ఉంది. గత కొన్నిరోజులుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతోన్న కుమార్తెకు వైద్యం చేయిస్తున్నారు. దీంతో అప్పులు అధికం కావడంతో భాస్కర్‌ డబ్బు సంపాదన కోసం అయిదు నెలల క్రితం దుబాయి వెళ్లాడు. కాగా సాహిత్య ఇటీవల తీవ్ర అనారోగ్యంకు గురికావడంతో దుబాయ్‌లో ఉన్న తండ్రి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఇరు దేశాల్లో కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌లు విధించడంతో రాలేకపోయాడు. దీంతో సాహిత్య శుక్రవారం మృతి చెందింది. కుమార్తె మృతి వార్త తెలుసుకున్న తండ్రి భాస్కర్‌.. దుబాయ్‌ నుంచి ఇండియాకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినా వీలుకాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కుమార్తె అత్యక్రియలను వీడియోకాల్‌లో దుబాయ్‌లో ఉన్న భాస్కర్‌కు చూపిస్తూ నిర్వహించారు. ఇదిలాఉంటే ఇటివద్ద ఉన్న తల్లిచేతిలో కూడా డబ్బులు లేకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు సాయం చేయడంతో అత్యక్రియలు నిర్వహించారు. కుమార్తె అత్యక్రియలను వీడియోకాల్‌లో వీక్షించిన భాస్కర్‌ కన్నీటి పర్యాంతమయ్యాడు. దీనిని చూసిన స్థానికులు చలించిపోయారు.

Also Read :ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

Next Story
Share it