దేశంలోని అన్ని ముస్లిం ఇళ్లపై జాతీయ జెండా ఎగరాలి..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 22 Dec 2019 9:33 AM IST

దేశంలోని అన్ని ముస్లిం ఇళ్లపై జాతీయ జెండా ఎగరాలి..!

ముఖ్యాంశాలు

  • దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది
  • మనకు ఆదర్శం గాంధీ, అంబేద్కరే: అసదుద్దీన్‌
  • ముస్లిం సోదరులు ఎవరి ట్రాప్‌లో పడొద్దు: అసదుద్దీన్‌

దేశంలో ప్రతి ఒక్క ముస్లిం ఇళ్లపై జాతీయ జెండా ఎగరాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రజల మధ్యలో గాంధీ లేడు.. కానీ గాంధీ జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. అంబేద్కర్‌ లేడు కానీ ఆయన రచించిన రాజ్యాంగం మనలో ఉందన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఇంటిపై ఎగురుతున్న జాతీయ జెండాను ప్రధాని మోదీ, అమిత్‌షా చూడాలన్నారు. శనివారం రాత్రి యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశం కోసం తాను ప్రాణాలు ఇస్తానని.. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘానిస్తాన్‌తో తనకేమి సంబంధం లేదని పేర్కొన్నారు. అస్సాంలో ఎంతో మందిపై బులెట్స్‌ కురిపిస్తున్నారని పేర్కొన్నారు. గన్స్‌లో బులెట్స్‌ ఖాళీ అవుతాయే తప్ప.. తాము ఈ పోరాటం ఆపమని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. దేశంలో కేవలం 4 శాతం పాస్‌ పోర్టు ఉన్న ప్రజలు మాత్రమే ఉన్నారని.. దేశంలో ఉన్న ముస్లిమ్స్‌ పేర్లు ఎన్‌ఆర్సీలో లేకపోతే వారి కుటుంబం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.

ఎన్‌ఆర్సీ వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. రాష్ట్రాలకు రాష్ట్రాలు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. దేశంలో ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోందని అసదుద్దీన్‌ వ్యాఖ్యనించారు. ప్రజలు ఎవరూ కూడా హింసకు పాల్పడవద్దని సూచించారు. తాను ఉన్నంత వరకు ముసల్మాన్‌లకు అన్యాయం జరగనివ్వనన్నారు. యువత భవిష్యత్‌ కోసం పోరాటం చేస్తానన్నారు. ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు వేశారని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ సీఎం జగన్‌ తనకు మంచి స్నేహితుడని అన్నారు. బీజేపీతో సీఎం జగన్‌ సంబంధం వదులుకోవాలన్నారు.

The National Flag

సీఏఏ, ఎన్‌ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు మిన్నంటుతున్నాయి. శనివారం పాతబస్తీలో ఉన్న చార్మినార్‌ వద్ద ముస్లింలు నిరసనలు చేపట్టారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో... పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఆందోళనకారులను భద్రతా బలగాలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఏఏ, ఎన్నార్సీ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Next Story