తలసాని దాతృత్వం.. 14 వేల మందికి చేయూత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 2:25 PM GMT
తలసాని దాతృత్వం.. 14 వేల మందికి చేయూత

కరోనా తెచ్చి పెట్టిన లాక్ డౌన్ లో చాలా మంది ఆకలి కేకలతో అలమటించారు. వలస కూలీల పరిస్థితి అయితే మరీ దయనీయం. లాక్ డౌన్ లో పనులు లేకపోవడంతో సొంతఊరికి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ ఊరికెళ్లేందుకు బస్సు, రైలు రవాణా సౌకర్యం లేదు. ఇక చేసేది లేక పిల్లా - జల్లాను కూడగట్టుకుని వందల కిలోమీటర్లు నడిచి సొంతఊరికి చేరుకున్నవారు ఎందరో ఉండగా..దారిమధ్యలోనే నీరసంతో సొమ్మసిల్లి చనిపోయిన వారూ ఉన్నారు.

అలాగే లాక్ డౌన్ కారణంగా సినీ, సీరియల్, రియాలిటీ షో లు ఇలా అన్ని రకాల షూటింగ్ లు నిలిచిపోవడంతో సినీ కార్మికులకు పూటగడవటమే కష్టంగా మారింది. అలాంటి వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సీసీసీని ప్రారంభించారు. ఈ కరోనా క్రైసిస్ ఛారిటీకి దాదాపు సినీప్రముఖులంతా తమ వంతు విరాళాలను ఇచ్చారు. ఆ విరాళాలతో స్వయంగా చిరంజీవి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి వాటిని ప్యాకింగ్ చేసి..సినీ కార్మికుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. అలాగే నటులు గోపీచంద్, శివాజీ రాజా వంటివారు కూడా కొంతమంది సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు.

ప్రస్తుతం తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీకార్మికులకు తనవంతు సహాయాన్నందించేందుకు ముందడుగు వేశారు. తలసాని ట్రస్ట్ ద్వారా పూట గడవటం కూడా కష్టంగా ఉన్న 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇటీవలే షూటింగులు జరుపుకునేందుకు అనుమతివ్వాలంటూ చిరంజీవి, నాగార్జునలతో పాటు ఇతర సినీ దర్శక, నిర్మాతలు సీఎం కేసీఆర్ ను కోరిన సంగతి తెలిసిందే కదా. అదే సమయంలో చిరంజీవి సినీ కార్మికులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రతిపాదన కార్యాచరణ తలసాని తన భుజానికెత్తుకున్నారు. గురువారం నుంచి సినీ కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు తలసాని ట్రస్ట్ సభ్యులు.

Next Story