తీవ్రవాదులు అమర్‌నాథ్ యాత్ర మీద కన్నేశారు: ఆర్మీ ఆఫీసర్
By సుభాష్ Published on 18 July 2020 9:55 AM ISTశ్రీనగర్: అమర్ నాథ్ యాత్ర జరిగే సమయంలో దాడి చేయాలని తీవ్రవాదులు భావిస్తూ ఉన్నట్లు జమ్మూ కాశ్మీర్ లోని భద్రతా దళాలకు సమాచారం అందింది. శుక్రవారం నాడు ఓ ఆర్మీ ఆఫీసర్ ఈ విషయాన్ని తెలిపారు. భద్రతా దళాలు పూర్తిగా అలర్ట్ అయి ఉన్నాయని.. అమరనాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా సమాయత్తమయ్యామని అన్నారు.
శుక్రవారం నాడు చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు, వారిలో జైష్-ఏ-మొహమ్మద్ కు చెందిన తీవ్రవాది కూడా ఉన్నాడు. అమరనాథ్ యాత్ర జులై 21న మొదలుకానున్న తరుణంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడంతో ఆర్మీ అధికారులు యాత్ర కోసం పటిష్ట భద్రత చేపట్టాలని భావిస్తూ ఉన్నారు.
'తీవ్రవాదులు అమరనాథ్ యాత్రను అడ్డుకునే అవకాశం ఉందనే సమాచారం తమకు అందింది.. భద్రతాదళాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి.. అమరనాథ్ యాత్రకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు.. ప్రశాంతంగా సాగిపోతుంది' అని బ్రిగేడియర్ కమాండర్ వివేక్ సింగ్ ఠాకూర్ దక్షిణ కాశ్మీర్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. అమరనాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా సాగిపోయేలా తాము ఏర్పాట్లు చేశామని, అక్కడి పరిస్థితులు, సెక్యూరిటీ మొత్తం తమ ఆధీనంలోనే ఉన్నాయని అన్నారు. నేషనల్ హైవే 44 మీద అమరనాథ్ యాత్రికులను తీసుకుని వెళ్లనున్నామన్నారు.
శనివారం కూడా జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలోని అమిషపొర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన జమ్మూ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన జవాన్లు వారి కాల్పులను తిప్పికొట్టాయి. ఎదురు కాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. శుక్రవారం కుల్గాం జిల్లాలోని నాగ్‌నాద్-చిమ్మేర్ ప్రాంతంలో ఉగ్రమూకలు సంచరిస్తున్నరన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టి వారిని హతమార్చాయి. భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులను స్వాధీనం చేసున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.