జమ్మూలో ముగ్గురు ముష్కరుల హతం

By సుభాష్  Published on  16 Jun 2020 6:00 AM GMT
జమ్మూలో ముగ్గురు ముష్కరుల హతం

జమ్మూకశ్మీర్‌లో కాల్పుల మోత రోజురోజుకు ఎక్కువైపోతోంది. భారత బలగాలు ఉగ్రవాదులకు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా తీరు మారడం లేదు. తాజాగా షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం ఉదయం శ్రీనగర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తుర్కంవాంగమ్‌ ఏరియాలో చోటు చేసుకున్న ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టినట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ 178, జమ్మూ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు.

షోపియాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు ఈ నిర్బంధ తనిఖీలు చేపట్టారు. బలగాలను చూసిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన భారత బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులకు దిగాయి. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదులు జబేర్‌ అహ్మద్‌, కమ్రాన్‌ జహుర్‌, మునాబ్‌ ఉల్‌ ఇస్లామ్‌గా గుర్తించారు. ఘటన స్థలంలో రెండు ఏకే 47, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని జమ్మూ పోలీసులు తెలిపారు.

కాగా, వారం రోజుల వ్యవధిలో షోపియాన్‌లో ఇది నాలుగు ఎన్‌కౌంటర్‌. జూన్‌ 8న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది, 10న ఐదుగురు హతమయ్యారు. గడిచిన రెండు వారాల్లో ఆరుగురు ఇలా ఇప్పటి వరకూ మొత్తం 27 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టాయి.

Next Story
Share it