జుట్టు రాలే సమస్యకు చెక్..ఈ 10 చిట్కాలు మీ కోసమే
By రాణి Published on 14 March 2020 5:55 PM ISTపెళ్లైనా..కాకపోయినా..అబ్బాయి అయినా..అమ్మాయి అయినా ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న సర్వ సాధారణమైన సమస్య..జుట్టు రాలిపోవడం. గృహిణులైతే..పిల్లల్ని కనడం వల్ల, మెంటల్ టెన్షన్స్ వల్ల ఎక్కువగా జుట్టు రాలిపోతుంటుంది. అలాగే ఉద్యోగం చేసే యువతకు కూడా జుట్టు రాలుడు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృత్తి పరమైన ఒత్తిడులు, కాలుష్యం, చుండ్రు, తలలో చెమటలు..ఇలా జుట్టురాలిపోవడానికి పలు కారణాలున్నాయి. జన్యుపరమైన సమస్యల వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది. చాలా మంది అబ్బాయిలకు పెళ్లిళ్లు కాకపోవడానికి ఒక ముఖ్య కారణం కూడా జుట్టు రాలిపోవడమే.
చాలా మంది తమ జుట్టు రాలిపోవడానికి అసలు సమస్య తెలుసుకోలేక పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ..తలకి రసాయనాలను పట్టించుకుంటుంటారు. హెయిర్ వాష్, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్, ఇలాంటి హెయిర్ ట్రీట్ మెంట్ల కోసం అయితే వేలకు వేలు ఖర్చుపెడుతున్నారు గానీ..ఇంట్లోనే చేసుకోగలిగే సింపుల్ రెమెడీల గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా ? తెలుసుకుంటే వాటిని పాటించారా ? అందుకే జుట్టు రాలకుండా, అలాగే మగువలకు జుట్టు ఒత్తుగా పెరిగేందుకు మేము మీకు..10 చిట్కాలను చెప్తున్నాం. అందులో మీకు నచ్చిన చిట్కా పాటించి..మీ సమస్యకు చెక్ పెట్టండి.
10 చిట్కాలు మీకోసం
1.కొబ్బరి నూనె
తలస్నానం చేయడానికి ముందు రాత్రి కొద్దిగా కొబ్బరి నూనెను..మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. అలాగే ఒక రాత్రి గడిచిన తర్వాత తలస్నానం చేయాలి. లేదా వేడిచేసిన కొబ్బరినూనెను తలకు బాగా పట్టించి టవల్ తో కప్పేయాలి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి..ఇలా రెండ్రోజులకొకసారి చేస్తే..జుట్టు పెరగడంతో పాటు..జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. కానీ గుర్తుంచుకోండి..తలలో చెమట పట్టినపుడు మాత్రం కొబ్బరినూనె రాయకూడదు.
2. రాతి ఉసిరి నూనె
సాధారణంగా ఉసిరి తినడం వల్ల శరీరానికి సి విటమిన్ లభిస్తుందంటారు. అందులో ఉండే పులుపు మన శరీరానికి సి విటమిన్ ను ఇస్తుంది. ఉసిరి ఆయిల్ తలకు రాయడం వల్ల చుండ్రు పోవడంతో పాటు జుట్టు ఒత్తుగా..పొడవుగా కూడా పెరుగుతుంది.
కాస్తంత ఉసిరి నూనెను రెండు చేతులతో తలకు పట్టించాలి. ఒక గంట సేపు తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తూ ఉంటే..జుట్టు రాలడం తగ్గుతుంది.
3.ఆలివ్ ఆయిల్
ఎప్పుడూ ఫిట్ నెట్ కోసం పాకులాడేవారంతా ఆలివ్ ఆయిల్ ను తమ డైట్ లో తీసుకుంటుంటారు. వారు ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలను మాత్రమే తింటారు. సరే..ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ను ఎలా వాడితే జుట్టు బలపడుతుందో తెలుసుకుందాం.
ఆలివ్ ఆయిల్ ను డైరెక్ట్ గా మాడుకు పట్టించాలి. ముఖ్యంగా..మాడుపై ఎక్కడైతే ఎండిపోతున్నట్లు లేదా..జుట్టు రాలిన రంధ్రాలు కనిపిస్తే అక్కడ ఆలివ్ ఆలివ్ ను రాయాలి. తర్వాత నిదానంగా మసాజ్ చేయాలి. 15 నిమిషాలు ఆగి..తలస్నానం చేయాలి. ఇలా ఆలివ్ ఆయిల్ జుట్టుకు పట్టించడం వల్ల రక్తప్రసరణ కూడా వేగంగా జరుగుతుంది. దీని వాడకంతో జుట్టు పెరగడమే కాకుండా..మెత్తగా, ఒత్తుగా..మెరుస్తుంటుంది కూడా.
4.అలోవీరా, ఆముదం నూనె
ఆముదం అనగానే..పిల్లలు, పెద్దలు అదోరకమైన face expression పెడతారు కానీ.. ఆముదం వాడటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. జుట్టుకు ఆముద నూనె రాయడం వల్ల ఒత్తుగా పెరుగుతుంది. ఒక కప్పు కలబంద గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల ఆముద నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివళ్ల వరకూ జుట్టుకు పట్టించాలి. అలా ఒక రాత్రంతా గడిచాక..తెల్లారి తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మీకు వీలైతే పైన చెప్పిన మిశ్రమంలో మెంతిపొడి కూడా కలుపుకోవచ్చు.
5.గుడ్లు
రోజుకొక కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని, ముఖ్యంగా గర్భిణులు, పిల్లలు గుడ్డు తినడం వల్ల అందులోని పోషకాలు, విటమిన్ ఎ, విటమిన్ డి శరీరానికి వంట పడతాయని చెప్తుంటారు. గుడ్డును చాలా మంది తమ డైట్ లో కూడా తీసుకుంటుంటారు.
రెండు గుడ్లలోని మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న దానిని జుట్టుకు పట్టించి అరగంట సేపు అలాగే వదిలేయాలి. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లలో బలం పెరిగి..ఊడకుండా ఉంటుంది. అలాగే జుట్టు మెత్తగా ఉండి..మెరుస్తుంది కూడా. ఇలా నెలలో రెండుసార్లు చేస్తే చాలు.
6.జీడిమామిడి, కొబ్బరినూనె
జీడిమామిడి, కొబ్బరి నూనె కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు గట్టిబడతాయి. అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుందీ మిశ్రమం.
జీడి మామిడిని రెండు ముక్కలుగా కోసి..మాడుపై రుద్దుతూ మసాజ్ లా చేసుకోవాలి. తర్వాత కెమికల్స్ లేని షాంపూతో తలంటు కోవాలి. ఇదొక పద్ధతి..
మరొక పద్ధతిలో వేడి చేసిన కొబ్బరి నూనెను జుట్టుకు పట్టించాక..జీడి మామిడిని మెత్తటి పేస్ట్ లా చేసుకుని జుట్టుకు పట్టించాలి. ఇలా ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాక 30 నిమిషాలపాటు వదిలేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే..మీ జుట్టు పెరుగుదలలో మెరుగైన ఫలితం ఉంటుంది.
7.నిమ్మరసం, కలబంద
ఈ చిట్కా కేవలం ఆడవాళ్లకే కాదు. మగవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వీలైతే ట్రై చేయండి.
రెండు నిమ్మకాయల రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తలకు పట్టించి మర్దనా చేయాలి. 10 నిమిషాలు ఆగి..తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలకు పట్టిన జిడ్డు, దుమ్మును నిమ్మరసంలో ఉండే పులుపు పోయేలా చేస్తుంది.
ఒక గిన్నెలోకి కలబంద గుజ్జు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం పిండి ..జుట్టుకు పట్టించాలి. కొద్దిసేపయ్యాక తలసానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మృదుత్వంతో పాటు ఒత్తుగా కూడా పెరుగుతుంది.
ఈ రెండింటిలో మీకు ఏది చాలా ఉపయోగంగా, ఈజీగా ఉంటుందో..ఆ చిట్కా పాటించండి.
8.గుమ్మడి విత్తనాల నూనె
సాధారణంగా గుమ్మడికాయ ను ఇంటి ముందు దిష్టి పోయేందుకు కడతారు. లేకపోతే..కూరగుమ్మడికాయతో కూర వండుతారు. అంతేగాని గుమ్మడి విత్తనాలతో నూనె ఏంటబ్బా ? అనుకుంటున్నారా. ఒకసారి చదవండి.
గుమ్మడి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన యాసిడ్లు, అమినో ఫ్యాట్స్ తో పాటు మనకి కావలసిన విటమిన్లు కూడా ఉంటాయట. ఈ విత్తనాలతో తీసిన నూనెను మనం తలకి పట్టించడం వల్ల..కుదుళ్లు గట్టిపడి జుట్టు ఊడటం తగ్గుతుందట.
గుమ్మడి విత్తనాల నూనెను కొబ్బరినూనె లాగే తలకు పట్టించాలి. మీకు వీలైతే ఒకరాత్రి, లేకపోతే ఒక గంట ఆగి తలస్నానం చేయొచ్చు. ఇలా జుట్టుకు నూనె పట్టించి తలస్నానం చేసేంత సమయం లేనివాళ్లు..రోజుకు మూడు పూటలా పూటకొక స్పూన్ నూనె తాగితే..జుట్టు ఎదుగుతుందట. కేవలం ఒక్క నెలలోనే జుట్టు పెరుగుదలలో చాలా మార్పు ఉంటుందట కూడా.
9. గ్రీన్ టీ
గ్రీన్ టీ..ఇప్పుడు చాలా మంది ఇది తాగితే బరువు తగ్గిపోతామని భావిస్తూ..రోజుకు మూడు నాలుగు సార్లు తాగేస్తున్నారు. సరే..అలా తాగే వాళ్లని మనం తప్పు పట్టలేం కానీ..రోజుకు రెండుసార్లైతే గ్రీన్ టీ తాగొచ్చు. మరీ చేదుగా తాగలేని వారు అందులో తేనె కలుపుకోవచ్చు. ఇలా రోజుకు రెండు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల కూడా జుట్టు పెరుగుతుందంటున్నారు నిపుణులు.
అలాగే వేడిగా ఉన్న గ్రీన్ టీ తో తలంటుకుంటే..తలలో ఉండే ఫంగస్, మురికి, చుండ్రు కూడా పోతుందట. అందులో ఉండే చేదు తలలోకి ఎలాంటి బాక్టీరియా ఉండకుండా చంపేస్తుంది. వీలైతే ట్రై చేయండి.
10. ఉల్లిరసం, తేనె
చిన్నపిల్లలకు మాటలు బాగా రావాలని..చాలా మంది తేనె తినిపిస్తుంటారు. అయితే ఈ కాలంలో షాపుల్లో లభించే తేనెల కంటే..తేనె తుట్టుల నుంచి పిండిన తేనె దొరకడమే కష్టమైపోతుంది సిటీల్లో. ఏ పల్లెటూర్లోనో..ఏదొక మూల మాత్రమే అచ్చమైన..స్వచ్ఛమైన తేనె లభ్యమవుతుంది. తేనె తినడం వల్ల కూడా జుట్టు కుదుళ్లు బలపడతాయని చెప్తున్నారు న్యూట్రీషియన్లు. తినమన్నారు కదా అని ఒకేసారి కిలో తినేయకండి..రోజూ కొద్దికొద్దిగా తీసుకోవడం ఆరోగ్యకరం.
ఉల్లిపాయని గ్రైండ్ చేసుకుని అందులో ఉండే రసాన్ని జుట్టుకు పట్టించాలి. తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో తలంటుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే..జుట్టు ఒత్తుగా , దృఢంగా ఉంటుంది.
Also Read : డ్రైఫ్రూట్స్ తో అధిక బరువును తగ్గించుకోండిలా..