డ్రైఫ్రూట్స్ తో అధిక బరువును తగ్గించుకోండిలా..

By రాణి  Published on  7 March 2020 6:30 AM GMT
డ్రైఫ్రూట్స్ తో అధిక బరువును తగ్గించుకోండిలా..

అధికంగా పెరిగిన బరువును తగ్గించుకునేందుకు చాలా మంది తంటాలు పడుతుంటారు. అన్నంతినడం మానేసి, చపాతీలు, లిక్విడ్ డైట్ లు, నాన్ వెజ్ డైట్ ల పేరుతో సరైన ఆహారం తీసుకోరు. దీని వల్ల వెయిట్ అయితే తగ్గుతారు గానీ..శరీరానికి సరైన పోషకాహారం లభించదు. తద్వారా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే డైట్ పేరుతో ఆహారం తీసుకోవడం మానేస్తే..లేనిపోని రోగాలు శరీరంపై దాడి చేస్తాయి. రోజుకు ఒక్కపూట అన్నంతిని..రెండో పూట పూర్తిగా చపాతీలు కాకుండా కప్పు అన్నం, రెండు చపాతీలు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు చెప్తున్నారు. అలాగే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చట. అదెలాగో..ఇప్పుడు తెలుసుకుందాం.

Dried Apricots

1. వేయించిన ఆప్రికాట్స్

వేయించిన ఆప్రికాట్స్ ను రోజూ తినడం వల్ల ఎక్కువ ఆకలి వేయకుండా ఉంటుంది. ఆకలి లేకపోతే ఏదీ తినాలన్న ఆశ ఉండదు కాబట్టి మీ శరీర బరువును త్వరగా తగ్గించుకునే వీలుంటుంది. న్యూట్రీషియన్స్, డైట్ ట్రైనర్స్ కూడా ఎక్కువగా ఆప్రికాట్స్ తినమని చెబుతుంటారు. ఎక్కడికెళ్లినా వీటిని మీతో తీసుకెళ్లి తినడం సులభం. స్కూల్, కాలేజ్, ఆఫీస్..ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లినపుడు కూడా వీటిని వెంటతీసుకెళ్లవచ్చు. శరీర బరువును తగ్గించడంలో ఆప్రికాట్ చాలా సహాయపడుతుంది.

Dates2.ఖర్జూర పండ్లు

ఖర్జూర పండ్లు తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఐరన్ లభిస్తుంది. అలాగే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇదొక చక్కటి అల్పాహారం కూడా. పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటారు కాబట్టి..అధిక బరువున్న పిల్లలు తమ బరువును తగ్గించుకోవడం కోసం ఈ ఖర్జూర పండ్లను తినవచ్చు. మీకు ఆకలి వేస్తుందనుకున్నప్పుడు ఖర్జూర పండ్లను తింటూ ఉంటే..నెమ్మదిగా మీ శరీరంలో మార్పు వచ్చి..శరీరంలో ఉన్న కొవ్వు తొలగిపోయేలా ఖర్జూరం ఉపయోగపడుతుంది. ఖర్జూరపండ్లకన్నా ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తినడం ఉత్తమం.

Pistachios3.పిస్తా

కొన్నేళ్ల నుంచి పిస్తా పప్పు తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు వైద్యులు. ఈ గ్రీన్ నట్ ను తినడం వల్ల రక్తంలోని షుగర్ ను తగ్గించి..మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. అలాగే చిరుతిండి తినాలనిపించినపుడు పిస్తా తినడం వల్ల నెమ్మదిగా చిరుతిండి వ్యామోహం తగ్గుతుంది. చాలా మంది పిస్తా తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనుకుంటారు గానీ..నిజానికి శరీర బరువును తగ్గించడంలో ఇది చాలా త్వరగా పనిచేస్తుంది. ఇందులో చాలా తక్కువ క్యాలరీలుంటాయి. మీ రెగ్యులర్ డైట్ లో కాస్త పిస్తా ను కూడా తింటే..త్వరగా బరువు తగ్గే అవకాశముంది.

Prunes4.నల్ల ఎండు ద్రాక్ష

నల్ల ఎండుద్రాక్ష మలబద్ధకాన్ని నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే శరీరంలో ఉండే వ్యర్థాలను పోగొట్టేందుకు, బరువు తగ్గేందుకు నల్ల ఎండుద్రాక్ష దోహదపడుతుంది. అంతేకాక రక్తం తక్కువగా ఉన్నవారు వీటిని తినడం వల్ల రక్తం పడుతుంది. షుగర్ ను కంట్రోల్ చేస్తుంది నల్ల ఎండుద్రాక్ష.

Raisins5.ఎండు ద్రాక్ష

సహజంగా ఎండు ద్రాక్ష అందరికీ తెలిసిన డ్రై ఫ్రూట్. ఇంటిలో చేసే పరమాన్నం, పాయసం, చక్కెరపొంగలి వంటి తీపి వంటకాలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సహజ సిద్ధమైన తీపిని కలిపి ఉండే ఈ ఎండు ద్రాక్ష అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు..మన జీవక్రియను కూడా పెంచుతుంది. ఎండుద్రాక్షను తినడం వల్ల పెద్దగా ఆకలి వేసినట్లు అనిపించదు.

Cashew Nuts6.జీడిపప్పు

బరువు తగ్గాలనుకునే వారు జీడిపప్పు తినకూడదని, అందులో కొవ్వును పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్తుంటారు పెద్దవాళ్లు. కానీ..ముక్కలు చేయకుండా ఉండే జీడిపప్పు తినడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది. అందరికీ ఇష్టమైన డ్రై ఫ్రూట్ ఇది. జీడిపప్పు తినడం వల్ల గుండె జబ్బులు ఎక్కువగా రావు. ఇందులో ఉండే మెగ్నీషిం కొవ్వును కరిగింపజేసి..జీవక్రియను నియంత్రిస్తుంది. మరీ తెల్లగా కాకుండా..కాస్త లేతరంగులో ఉన్న జీడిపప్పు తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

Almonds7.బాదంపప్పు

బాదంపప్పు వల్ల కలిగే ఉపయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం పూట నానబెట్టి, తోలు తీసిన బాదంపప్పులు పెడుతుంటారు అమ్మలు. బాదం పప్పు తినడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. చర్మానికి కూడా ఈ డ్రై ఫ్రూట్ చాలా మంచిది. కేలరీలు తక్కువగా ఉండే బాదంపప్పును అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

Walnuts8.వాల్ నట్స్

బరువు తగ్గేందుకు వాల్ నట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి రోజూ ఇవి తినడం వల్ల అనారోగ్యం రాకుండా ఉంటుంది. బాదం పప్పు వలే ఇది కూడా జుట్టుకు దృఢత్వాన్నిస్తాయి. జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. సీ ఫుడ్ (చేపలు, రొయ్యలు, పీతలు) తినని వారు..వాటి ద్వారా వచ్చే పోషకాలను వాల్ నట్స్ తినడం ద్వారా పొందవచ్చు. పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో వాల్ నట్స్ ప్రయోజనకరంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా, ఆమ్లాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు ఎక్కువగా ఆకలి లేకుండా చేస్తాయి. తద్వారా త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడుతాయి.

Hazel Nuts9.హాజెల్ నట్స్

హాజెల్ నట్స్ తినడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. అలాగే అనారోగ్యకరమైన అల్పాహార అలవాట్లను నిరోధిస్తాయి. వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు (healthy fat) ఉంటాయి. వీటికున్న మరొక గొప్పతనం ఏమిటంటే..చిరుతిండికి అలవాటుపడిన వారు వీటిని తినడం వల్ల ఆ అలవాటును త్వరగా మానుకోవచ్చు. అలాగే ఎక్కువ కేలరీలతో తీసుకునే ఆహారం నుంచి దూరంగా ఉంటుంది. ఈ గింజలకు ఉండే రుచి అటువంటిది మరి.

Brazil Nuts10.బ్రెజిల్ నట్స్

బ్రెజిల్ నట్స్ తిన్నవారెవరైనా క్రీమ్ ను తిన్న అనుభూతి పొందుతారు. చిన్నపిల్లలకు ఈ గింజలు చాలా ఫేవరెట్. వీటిలో ఉండే ఎల్ అర్జినిన్ అనే పదార్థం కొవ్వును కరిగించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు..అధిక బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. వీటిలో ఉండే పామిటోలిక్ ఆమ్లం, ఒలేయిక్ ఆమ్లాలు కొలెస్ర్టాల్ స్థాయిని నియంత్రించేలా ఉపయోగపడుతాయి. వివిధ రకాల క్యాన్సర్లను నివారించడంతో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ వీటిలో ఉండే సెలీనియం ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది కాబట్టి బ్రెజిల్ నట్స్ ను ఆహారంతో పాటు తీసుకునేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా తక్కువ మోతాదులో వీటిని తినడం ఉత్తమం.

Figs11.అత్తిపండ్లు

మల్ బెర్రీ జాతికి చెందిన అత్తిపండ్లను రోజూ ఆహారంతో పాటు తినడం వల్ల బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. తాజాగా ఉండేవి లేదా పచ్చివైనా తినొచ్చు. వీటలో ఉండే అధిక ఫైబర్, ఎంజైమ్ లు జీర్ణక్రియను పెంచుతుంది. కేలరీలను కరిగింపజేయడంలో అత్తిపండ్లు ఉత్తమమైన పాత్రను పోషిస్తాయి. ఏదైనా తీపి పదార్థం తినాలనిపించినప్పుడల్లా అత్తిపండ్లను తినడం వల్ల చక్కెరతో చేసినవి లేదా ఐస్ క్రీమ్ వంటివి తినాలన్న కోరికను అణచివేస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి..రోజు వారీ స్నాక్స్ గా తీసుకోవచ్చు.

Black Berries12.బ్లాక్ బెర్రీస్

బ్లాక్ బెర్రీస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి..బరువు తగ్గాలని ఆరాటపడేవారు రోజూ చిరుతిండిగా తీసుకోవచ్చు. తియ్యగా ఉండే ఈ బ్లాక్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని విషపదార్థాలను తొలగించంలో సహాయపడుతాయి. ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి పోషకాలతో పాటు..రోగనిరోధక శక్తి లభిస్తుంది.

Pine Nuts13.పైన్ నట్స్

పైన్ నట్స్ లో ఉండే పినోలెనిక్ ఆమ్లం అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇవి తినడం వల్ల ఆకలి నశిస్తుంది కాబట్టి శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఈ గింజల్లో కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి..మితంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గేలా చేస్తాయి. అలాగే వీటిలో ఉండే ఐరన్ మీకు వయసు పైబడినా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

Black Currant Fruits14.బ్లాక్ కరెంట్ ఫ్రూట్స్

ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలన్నీ బ్లాక్ కరెంట్ ఫ్రూట్స్ లో కూడా ఉంటాయి. తీపి తక్కువగా ఉండే ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ప్రీ వర్కవుట్ స్నాక్స్ లా వీటిని తీసుకోవచ్చు. బ్లాక్ కరెంట్ ఫ్రూట్స్ లో రెండు రకాలుంటాయి. తీపి, పుల్లని బ్లాక్ కరెంట్స్ తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో పోషకాలు లభిస్తాయి. వీటిని ఎండబెట్టి తీసిన నూనెను జీర్ణ సమస్యల చికిత్స కోసం ఉపయోగిస్తారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊబకాయం, గుండె సమస్యలపై బాగా పనిచేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తాయి.

Pecan Nuts15.పెకాన్ నట్స్

వాల్ నట్స్ జాతికి చెందిన ఈ పెకాన్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే జీర్ణక్రియ, జీవక్రియను పెంచడం ద్వారా త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వీటిలో కొవ్వు పదార్థాలున్నప్పటికీ..ఒలేయిక్ ఆమ్లం ఆకలి మందగించేలా చేస్తుంది కాబట్టి బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పైన్ నట్స్ లాగానే ఇవి కూడా మీ వయసు కనిపించకుండా..యవ్వనాన్ని పెంపొందిస్తుంది.

మీరు ఎక్కడికైనా వెళ్లేటపుడు డ్రై ఫ్రూట్స్ ను తీసుకెళ్లడం చాలా సులభం కాబట్టి..నిత్యం డ్రై ఫ్రూట్స్ డైట్ ను ఫాలో అవ్వొచ్చు. అలాగే ఎక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని నియంత్రించుకునేందుకు కూడా డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. రోజు స్నాక్స్ టైమ్ లో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలుంటాయి. వీలైతే ఒక నెలరోజుల పాటు డ్రై ఫ్రూట్స్ డైట్ ను ఫాలో అయి చూడండి..

పైన చెప్పినవన్నీ కాకపోయినా..మీకు అందుబాటులో ఉండేవి, లభించేవైనా ప్రతిరోజూ ఆహారంతో పాటు తీసుకోవడం అలవాటు చేసుకుంటే..బరువు తగ్గడమే కాకుండా..ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Also Read :

https://telugu.newsmeter.in/ten-easy-exercises-to-loss-weight/

Next Story