పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా నమాజ్ కు వెళ్లిన 10 మందిపై కేసు నమోదు
By సుభాష్ Published on 10 April 2020 11:52 AM GMTహైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు అవుతున్న సమయంలో కొందరు ప్రభుత్వ ఆదేశాలను అసలు పట్టించుకోవడం లేదు. ఎక్కువ మంది గూమికూడగూడదు అని పోలీసులు చెబుతున్నా కూడా పట్టించుకోని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గుళ్లు, మసీదులు, చర్చిలు మూసేయాలని నిబంధనలు విధించారు. కానీ కొందరు ఆ నిర్ణయాన్ని అసలు ఖాతరు చేయలేదు.
ఏప్రిల్ 8న మసీదులో నమాజ్ కు హాజరైన 10 మందిపై పోలీసులు కేసులు బుక్ చేశారు. సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాచుపల్లిలో బుధవారం నాడు నమాజ్ కు 10 మంది హాజరయ్యారు. వారిలో 9 సంవత్సరాల పిల్లాడు కూడా ఉన్నాడు. ఆదేశాలను పట్టించుకోకుండా నమాజ్ వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు.. వారిపై కేసులు నమోదు చేశారు.. అలాగే మసీదు ఇమామ్ లను కూడా అరెస్టు చేశారు.
సైబరాబాద్ పోలీసుల కథనం మేరకు.. అరెస్టు కాబడిన వాళ్లంతా నిజాంపేట గ్రామ వాస్తవ్యులే. ఇందిరమ్మ ఫేజ్ 2 లో ఉన్న మసీదులో వీరందరూ కలిసి ప్రార్థనలు చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు మసీదు దగ్గరకు వెళ్లారు. నమాజ్ చేస్తున్న వారికి పోలీసులు వచ్చారని తెలియడంతో పారిపోడానికి ప్రయత్నించారు. కొందరు వేరే కాలనీలోకి పారిపోయారు. వాళ్ళను కూడా పోలీసులు పట్టుకున్నారు.
ఇమామ్ లు అయిన షేక్ ఉస్మాన్ 56, షరీఫుద్దీన్ 50 లతో పాటూ మొహమ్మద్ గౌస్ 25, నిహాల్, జస్మొద్దీన్, మరో ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు 9,15,17 సంవత్సరాల వాళ్లు కూడా నమాజ్ చేస్తూ ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా ఉండడమే కాకుండా, వీరందరూ కనీసం సామాజిక దూరం పాటించలేదని పోలీసులు తెలిపారు. బాచుపల్లి పోలీసులు వీరందరిపై 188, 269, 270, 271, 336 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 3 ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద మరో కేసును నమోదు చేశారు.
ఇంతకు ముందు ఆదివారం నాడు ప్రేయర్లను నిర్వహించిన చర్చి పాస్టర్ పై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు మతపరమైన కార్యక్రమాలు పాటించకూడదని ఎన్నో సార్లు మొరపెట్టుకుంటూ ఉన్నారు. అయినా కూడా కొందరు మాట వినడం లేదు. కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయడానికి లాక్ డౌన్ లాంటివి పాటించమని కోరుతూ ఉంటే కొందరు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం చాలా దారుణం.