కౌలాలంపూర్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు..
By రాణి Published on 18 March 2020 6:13 PM IST
కరోనా ప్రభావంతో మలేసియాలోని ఎయిర్ పోర్టులను మూసివేశారు. వాటిలోనే కౌలాలంపూర్ విమానాశ్రయం కూడా ఒకటి. అక్కడున్న 150 మంది తెలుగు విద్యార్థులు..కరోనా ఎఫెక్ట్ ను గుర్తించి..వెంటనే ఇంటికి వెళ్లిపోవాలంటూ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. అక్కడే వారి గట్టి షాక్ తగిలింది. ఎయిర్ పోర్ట్ మూసివేశారు. ఒక్క విమానం కూడా లేదు. దీంతో కొందరు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా భారత ప్రభుత్వానికి తమకు ప్రత్యేక విమానాలు కేటాయించి ఇండియాకు తీసుకువెళ్లాల్సిందిగా వీడియో సందేశాలను పంపారు. ఒక్క కౌలాలంపూర్ లోనే కాదు..పిలిప్పీన్స్ రాజధాని మనీలా విమాశ్రయంలో కూడా విద్యార్థులు పడిగాపులు పడ్డారు. అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల్లో విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన 200మంది విద్యార్థులున్నారు.
Also Read : బిగ్ బ్రేకింగ్ : రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు బంద్
ఎట్టకేలకు 350 మంది విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. అక్కడి అధికారులతో మాట్లాడి విశాఖపట్నం, ఢిల్లీ వరకూ ఎయిర్ ఏషియా విమానాలను అనుమతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రకటించడంతో..విద్యార్థులు దాదాపు ఇండియా వచ్చేసినంత ఆనందపడ్డారు. బుధవారం మధ్యాహ్నం కౌలాలంపూర్ లో చిక్కుకుపోయిన 150 మంది తెలుగు విద్యార్థులు ఎయిర్ ఏషియా విమానంలో విశాఖపట్నానికి బయల్దేరారు. అక్కడ వారందరికీ స్ర్కీనింగ్ టెస్టులు చేసిన తర్వాతే విమానం ఎక్కేందుకు అనుమతించారు. విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించింది. ఆనందంతో విమానమెక్కిన విద్యార్థులు..ఇండియా వచ్చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు.
Also Read : ట్విట్టర్ లో కరోనా పొలిటికల్ వార్