తెలుగు రాష్ట్రాల్లో వికసించిన 'పద్మాలు'..

By అంజి  Published on  26 Jan 2020 9:06 AM IST
తెలుగు రాష్ట్రాల్లో వికసించిన పద్మాలు..

ఢిల్లీ: దేశానికి చెందిన అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 71వ రిపబ్లిక్‌ వేడుకల సందర్భంగా.. 2020 సంవత్సరానికిగానూ వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు చేసిన పలువురిని పద్మ పురస్కారాల కోసం ఎంపిక చేసింది. ఈ సంవత్సరం 141 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మ శ్రీ పురస్కారాల దక్కగా తెలుగు క్రీడా తేజం పీవీ సింధుకు పద్మభూషణ్‌ పురస్కారం దక్కింది.

బ్యాడ్మింటన్‌ సంచలనం పీవీ సింధు..

తెలుగు తేజం పీవీ సింధుకు మరో పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించింది. ఐదేళ్ల క్రితం సింధుకు పద్మశ్రీ వరించింది. పీవీ సింధు ఖాతాలో ఇప్పటికే ఐదు ప్రపంచఛాంపియన్‌షిప్ పథకాలు ఉన్నాయి. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఆమె రజతం సాధించింది. పీవీ సింధు దేశ యువతకు ఆదర్శం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. ఇప్పుడు క్రీడారంగంలో సంచలనతారగా మారింది.

కేంద్రం పద్మశ్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది: చింతల వెంకటరెడ్డి

సెంద్రీయ వ్యవసాయంలో చింతల వెంకటరెడ్డి (69) ఇప్పటికే కొత్త పుంతలు తొక్కారు. ఆయన స్వస్థలం సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌ ప్రాంతం. సెంద్రీయ పద్ధతిలో పంటలు పండించే ఆయన ఇప్పటికే అనేక రికార్డులు నెలకొల్పాడు. వెంకటరెడ్డి పండించిన ద్రాక్షా పండ్లను ఇద్దరు అమెరికా అధ్యక్షులు రుచి చూశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. 2001లో హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు, 2006లో హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌కు థామ్సన్‌ ఫ్లేమ్‌, బ్లాక్‌ సీడ్‌ ద్రాక్ష పండ్లను అందించారు. భూమి లోపలి నుంచి తీసిన మట్టిని పలు దఫాలుగా ఎండబెట్టి పంటలకు వేసి ఎక్కువ మొత్తంలో దిగుబడి సాధించేవాడు. ఈ విధంగా ఆన్‌బ్‌షాహీ సీడ్‌ ద్రాక్షా సాగు చేసి హెక్టారుకు 105 టన్నుల దిగుబడి సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. వెంకటరెడ్డికి ఇప్పటికే పలు అవార్డులు దక్కాయి. పద్మశ్రీ పురస్కారం దక్కడంపై మీ అభిప్రాయం ఏంటని అడిగిన ప్రముఖ దినపత్రిక ప్రశ్నకు.. ఇది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాని తెలిపారు.

ప్రముఖ సంస్కృత పండితుడు శ్రీభాష్యం విజయసారథి

కవిగా పేరొందిన శ్రీభాష్యం విజయసారథి.. విమర్శనారంగంలో కూడా అనన్య కృషి చేశారు. వీరి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా చేగుర్తి గ్రామం. గోపమాంబ, నరసింహాచార్య దంపతులకు విజయసారథి జన్మించారు. బాసరలో సరస్వతి అమ్మవారిని ఉద్దేశించిన ఇతను రాసిన శ్లోకం.. ఇప్పుడు శ్రీవిశ్వేశ్వర సంస్కృతానంద కాలేజీలో ప్రార్థన శ్లోకంగా మారింది. మందాకిని కావ్యాన్ని రచించారు. ఇతన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

పౌరాణిక నాటక బ్రహ్మ.. యడ్ల గోపాల్‌రావు

ప్రముఖ రంగస్థల కళాకారుడు యడ్ల గోపాల్‌రావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ ఆయన స్వగ్రామం. దేశంకోసం.. అనేక సాంఘిక నాటకం ద్వారా గోపాల్‌రావు రంగస్థలం వేదిక మీద మొదటిసారిగా కనబడ్డారు. ఇప్పటి వరకు 5,600 ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్‌, ఒడిస్సా, వెస్ట్‌ బెంగాల్‌లో గోపాల్‌రావు ప్రదర్శనలు ఇచ్చారు. అమృతతరాము, అభినయ శ్రీకృష్ణ, నట విశిష్ట, పౌరాణిక నాటక బ్రహ్మతో పాటు పలు బిరుదులు గోపాల్‌రావుకు ఉన్నాయి. 2017లో నంది అవార్డు, 2016లో కందకూరి విశిష్ట, 2015లో బళ్లారి రాఘవ అవార్డులు దక్కాయి. పద్మపురస్కారం దక్కడంపై యడ్ల గోపాల్‌రావు మాట్లాడుతూ.. ఇది కళారంగానికి లభించిన మెప్పు అని పేర్కొన్నారు.

నా నమ్మకం ఒమ్ము కాలేదు: దళవాయి చలపతిరావు

ప్రాచీన కళ తోలుబొమ్మలాట అంతరించిపోతున్న తరుణంలో.. దానికి దళవాయి చలపతిరావు ప్రాణం పోశారు. అనంతరపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన చలపతిరావు.. తోలుబొమ్మలాటను తన జీవితంగా మలుచుకున్నాడు. కొత్త కొత్త తోలు బొమ్మలను తయారుచేస్తూ అందరీలోనూ ఆసక్తిని పెంచాడు. మొదట గ్రామీణ కళకారుడు అయిన చలపతిరావు.. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్నాడు. ప్రాచీణ కళకు ప్రాణం పోసిన చలపతిరావును కేంద్రం గుర్తించి పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఈ పురస్కారం రావడం తనకెంతో ఆనందంగా ఉందని చలపతిరావు అన్నారు.

Next Story