ప్రధానమంత్రిని కలవబోతున్న బుడతలు

By రాణి  Published on  22 Jan 2020 7:25 AM GMT
ప్రధానమంత్రిని కలవబోతున్న బుడతలు

ముఖ్యాంశాలు

  • జంటనగరాల స్పోర్ట్స్ స్టార్లకుబాల శక్తి అవార్డులు
  • సికింద్రాబాద్ బోల్టన్స్ స్కూల్లో చదువుతున్న పిల్లలు
  • షూటింగ్ లో మంచి ప్రతిభను కనబరుస్తున్న ఇషా సింగ్
  • మౌంటనీరింగ్ లో అద్భుతాలు పండిస్తున్న సామాన్యు
  • ప్రపంచ కప్ పై గురిపెట్టిన ఇషా సింగ్, గట్టి సాధన
  • మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం సామాన్యుకి పెద్దకల
  • రాష్ట్రపతి చేతులమీదుగా బాల్ శక్తి అవార్డులు
  • రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనేందుకు అవకాశం

హైదరాబాదీ షూటర్ ఇషాసింగ్, మౌంటెనీర్ పోతురాజు సామాన్యు ఈ ఏడాది అత్యుత్తుమ ప్రతిభను కనబరచినందుకు బాల శక్తి అవార్డుల్ని అందుకోబోతున్నారు. రాష్ట్రపతి భవనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా బుధవారం ఈ స్పోర్ట్స్ ఛాంపియెన్స్ ఈ అవార్డులను స్వీకరిస్తారు. మర్నాడు వీళ్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి ఆ తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంటారు. బాలశక్తి పురస్కారం కింద ఒక్కొక్కరికీ రూ.లక్ష నగదునుకూడా ఈ చిన్నారులకు ఇస్తారు. దీంతోపాటుగా ఓ ట్యాబ్లెట్ పీసీ, ఓ మెడల్, ప్రమాణ పత్రం, జ్ఞాపికలనుకూడా బహూకరిస్తారు.

పదిహేను సంవత్సరాల వయసు గల ఇషా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక బహుమతులు, మెడల్స్ ని సంపాదించి చిన్న వయసులోనే భారత కీర్తి పతాకను వినువీధిలో ఎగరేసింది. తొమ్మిదేళ్ల వయసున్న సామాన్యు తన వయసుకు మించిన పరిణతిని కనబరిచి అతి ఎత్తైన రెండు శిఖరాలను అధిరోహించాడు. పెద్దయ్యాక తనకు ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా సేవలందించాలని ఉందని ఈ బుడతడు చెబుతున్నాడు. నిజానికి వీళ్లిద్దరికీ ఓ కామన్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే వీళ్లిద్దరూ సికింద్రాబాద్ లోని బోల్టన్ స్కూల్లోనే చదువుతున్నారు. ఈ స్కూల్లో ఇషా తొమ్మిదో తరగతి చదువుతుండగా సామాన్యు నాలుగో తరగతి చదువుతున్నాడు. తమ స్కూల్ టీచర్లు, తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు కనుకనే అద్భుతాలు సాధించడానికి వీలవుతోందని వీళ్లు చెబుతున్నారు.

ఇషా దృష్టంతా వరల్డ్ కప్ మీదే

ప్రత్యేకించి తండ్రి సచిన్ సింగ్ ని, కోచ్ సుందర్ ఘాటేనీ ఇషా సింగ్ ఆకాశానికి ఎత్తేస్తోంది. తనకు షూటింగ్ అంటే ఇష్టం అన్న విషయాన్ని గ్రహించిన తన తండ్రి చాలా మంచి కోచ్ ని ఏర్పాటు చేసి షూటింగ్ లో మెలకువలు తెలుసుకోగలిగేలా తర్ఫీదు ఇప్పించారని ఇషా మురిసిపోతూ చెబుతోంది. తను తొమ్మిదేళ్ల వయసులో తొలి బుల్లెట్ ని కాల్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటోంది. ఒలంపిక్ విజేత్ గగన్ నారంగ్ తనకు ఆదర్శవంతుడైన షూటర్ అని ఇషా చెబుతోంది. ప్రస్తుతం ఇషా దృష్టంతా పూర్తిగా వరల్డ్ కప్ మీదే కేంద్రీకృతమై ఉంది.

Samanyu 2

అలవోకగా కొండల్ని ఎక్కేసే, మెరుపు వేగానికి చిరునామాగా నిలచే బుడతడు సామాన్యు సంగతి సరే సరి. కళ్లు మూసి తెరిచేంతలో అల్లంత దూరంలో కనిపించే మెరుపుతేజం సామాన్యు. అతి చిన్న వయసులో అతి పెద్ద కొండల్ని అలవోకగా ఎక్కేసిన వీరుడీ పిల్లాడు. టాంజానియాలోఉన్న కిలిమంజారో పర్వతాన్ని ఎక్కేసిన అతి చిన్నవయసు పిల్లాడిగా సామాన్యు రికార్డ్ సృష్టించాడు.

ఏడేళ్ల వయసులో సామాన్యు ఆగకుండా 8 రోజులపాటు కొండల్ని ఎక్కి బేస్ క్యాంప్ ని చేరుకున్నాడు. ఎవరెస్ట్ ని అధిరోహించే ప్రయత్నంలో తన అనుభవం ఇది. తర్వాతి సంవత్సరం యూరోప్ లోని మౌంట్ ఎల్ బ్రస్ ఎక్కేశాడు. అలా అలా రికార్డులమీద రికార్డులు బద్దలుకొట్టుకుంటూ మెరుపు వేగంతో ముందుకు వెళ్తున్నాడు. కానీ తను ఎవరెస్ట్ ఎక్కాలంటే మరో 7 సంవత్సరాలు అగితీరాల్సిందే అవసరమైన వయోపరిమితిని సంపాదించుకోవడానికి. కానీ సామాన్యు అంతదూరం వరకూ ఆగేట్టుగా లేడంటూ తన బిడ్డ ఉత్సాహాన్ని గురించి చాలా గొప్పగా చెబుతారు అతని తల్లి లావణ్య. ఎప్పుడెప్పుడూ 16 సంవత్సరాలువస్తాయా, ఎప్పుడు ఎవరెస్ట్ ని ఎక్కడానికి పరుగులు పెట్టాలా అని తన బిడ్డ ఆశగా ఎదురుచూస్తున్నాడని ఆమె అంటున్నారు.

Next Story