శ్రీశైలం ప్రాజెక్ట్ తెగిపోవడానికి సిద్దంగా ఉందా?!
By అంజి Published on 21 Nov 2019 4:04 PM ISTకర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ లోపాలపై వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు శ్రీశైలం ప్రాజెక్టు భవిష్యత్తుపై మరోసారి తీవ్ర స్థాయిలో చర్చలకు దారితీశాయి. 2009వ సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కనివిని ఎరుగని రీతిలో 226 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, అదృష్టం కొద్ది శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఏం కాలేదు. ఈసారి వచ్చిన వరదలతో శ్రీశైలం రిజర్వాయర్ ప్లంజ్పూల్‌లో ఏర్పడిన గోతి, రిజర్వాయర్ గోడలకు ఏర్పడిన బీటలు శ్రీశైలం ప్రాజెక్టు భవిష్యత్తుపై చర్చకు ఆస్కారమిచ్చాయి. 10 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల వలన అదృష్టం కొద్ది శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ విచ్ఛిన్నం కాకుండా నిలబడ్డాయని సామాన్య ప్రజలు కూడా భావించారు. ఇదే సందర్భంలో ఈ అంశాలపై నిపుణుల కమిటీ కూడా అనేక సూచనలు చేసింది.
శ్రీశైలం ప్రాజెక్టు పదికాలాల పాటు సుభిక్షంగా ఉండాలంటే తుంగభద్ర నదికి వరద కాలువ నిర్మాణం చేపట్టి, శ్రీశైలం రిజర్వాయర్‌ను బైపాస్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు నీటిని తరలించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి విజ్ణప్తి చేసింది. ప్లంజఫూల్‌కు ఏర్పడిన గోతికి, ప్రాజెక్టు గోడలకు ఏర్పడిన మరమ్మతులు చేపట్టాలి. అదృష్టాన్నే నమ్మిన పాలకులుపై అంశాలపై శాస్త్రీయ దృక్పథంలో కార్యాచరణ చేపట్టడంలో గతి పది సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాత్కాలిక అంశాలను ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు పాలకులు గత పది సంవత్సరాలుగా ప్రాధాన్యత నిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు సక్రమ నిర్వహణపైనే నాగార్జున సాగర్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందన్న విషయాన్ని పాలకులు, అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాయలసీమ సాగునీటి సాధన సమితి విజ్ఞప్తులు
1. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మరి ముఖ్యంగా రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలపై గతంలో జరిగిన తప్పిదాలను విస్మరించి అధికార పక్షం క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
2. శ్రీశైలం రిజర్వాయర్ కు ఏర్పడిన బీటలు, ఫ్లంజ్ ఫూల్ గోతుల మరమత్తులు శాస్త్రీయంగా చేపట్టాలి.
3.తుంగభద్ర వరద కాలువ నిర్మాణం గుండ్రేవుల, మాలిగ్నూర్ నుండి చేపట్టి శ్రీశైలం రిజర్వాయర్ బైపాస్ చేసి నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ తరలించాలి
4.శ్రీశైలం రిజర్వాయర్ లో పూడిక చేరడం అరికట్టి ప్రాజెక్టు జీవితం కాలం పెంచే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి.
బొజ్జా దశరథ రామి రెడ్డి. అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అధ్వాన్నంగా ఉందని.. వెంటనే మరమ్మతులు చేయకపోతే పెనువిషాదం తప్పదని హెచ్చరించారు. గంగాజల్ సాక్షరత్ యాత్రంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాజేంద్రసింగ్ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ఏదైనా విపత్తు జరిగితే ఏపీ కొట్టుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యామ్ నిర్వహణలో 600 మంది సిబ్బంది పని చేయాలని.. కానీ 100 మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులను నిర్వహణను ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యామ్ మరమ్మతులపై తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని రాజేంద్రసింగ్ కోరారు.
వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మత్తులకు చేపట్టాలి- రామకృష్ణ
సీఎం వైఎస్ జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని లేఖలో కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆనకట్టకు పగుళ్లు ఏర్పాడ్డాయని, ప్రమాదం పొంచి ఉందని వాటర్ మ్యాన్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ చెప్పారన్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ సామర్థ్యం 263 టీఎంసీలు కాగా, కుడివైపు 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలిగిన జలవిద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగు నీరందుతోందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు తగు సిబ్బందిని నియమించాలని సీపీఐ రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.