అదంతా దుష్ప్రచారమే: మంత్రి బాలినేని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 6:56 PM ISTఅమరావతి: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు సంప్రదాయేతర ఇంధన కంపెనీలు వెళ్లబోతున్నాయని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముప్పులాంటిందంటూ వచ్చిన కథనాలు దుష్ప్రచారంలో భాగమేనని విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకూ ఏ ఒక్క కంపెనీతో ఒప్పందాన్ని రద్దుచేసుకోలేదని మంత్రి బాలినేని తెలిపారు. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలును నిలిపివేయలేదన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చెల్లింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా ఈఆర్‌సీ ఇవ్వబోయే నిర్ణయాలను అమలు చేస్తామని.. చట్ట ప్రకారం ముందుకు సాగుతామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కేవలం సంప్రదాయేతర ఇంధనాన్ని సమకూర్చే సంస్థలకే కాదు, ఇతర కరెంటు కంపెనీలకు బకాయిలు పడిందన్నారు. గడిచిన 16-18 నెలలుగా రూ.18 వేల కోట్లకు పైబడి బకాయిలు ఉన్నాయన్నారు.
తాను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఈ పాపాలు ఈ ప్రభుత్వానికే అంటూ చంద్రబాబు గురివింద మాటలు చెప్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ రంగం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు కోల్పోయారు. తాను చేసిన పాపాలు ఇవాళ గుదిబండలయ్యాయన్న విషయాన్ని చంద్రబాబు మరిచిపోయినా ప్రజలు గుర్తుంచుకున్నారు. ఈ అప్పులు తీర్చడానికి రాయితీలతో కూడిన రుణాలు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని కోరామని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు. అవినీతి రహిత, పారదర్శక విధానాలను సీఎం జగన్ తీసుకువస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయాలతోనే మళ్లీ విద్యుత్ రంగానికి పునరుజ్జీవం వస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.