ఏపీ మందుబాబులకు మరిన్ని కష్టాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 12:53 PM GMT
ఏపీ మందుబాబులకు మరిన్ని కష్టాలు..!

ముఖ్యాంశాలు

  • బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష
  • బార్ల సంఖ్యను తగ్గించుకునేందుకు సీఎం జగన్‌ ప్లాన్‌
  • మద్యం ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం

అమరావతి: బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇవాళ సచివాలయంలో అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్టార్‌ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బార్ల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇప్పటికే మద్యం దుకాణాలను 20 శాతానికి తగ్గించామని, విడతల వారీగా తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. సుదీర్ఘ చర్చల తర్వాత బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. బార్లలో మద్యం సరఫరా వేళలను మార్పు చేయనున్నారు. బార్లలో మద్యం సరఫరాకు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ, ఆహారం రాత్రి 11 వరకూ.. స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 వరకూ మద్యం అనుమతి ఉంటుంది.

బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మద్యం కల్తీకి పాల్పడినా, స్మగ్లింగ్‌ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు నమోదుతో పాటు కఠిన చర్యలు తీసుకునేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లైసెన్స్‌ ఫీజుకు మూడు రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

రాష్ట్రంలో 40 శాతం బార్లను తగ్గిస్తున్నామని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. మద్యపాన నిషేధం అమలులో భాగంగా బార్లు తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడున్న బార్లను మొత్తం తీసేసి, కొత్తగా 40 శాతం తగ్గించి బార్లకు అనుమతిస్తామన్నారు. బార్లలో మద్యం ధరలను పెంచుతామని నారాయణస్వామి వెల్లడించారు.

ప్రతి మద్యం షాపులో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి దుకాణానికి తెలుగు, ఇంగ్లీషులో నేమ్‌ బోర్డులు ఉండాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయిస్తామన్నారు. బార్లలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దశలవారీగా వైసీపీ ప్రభుత్వం మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గించిన ప్రభుత్వం.. బార్ల సంఖ్యను కూడా తగ్గిస్తుండడంతో మహిళలు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story