ఫ్లై ఓవర్ పనులు పైపైకి...!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 6:17 PM ISTవిజయవాడ: దుర్గా ప్లైఓవర్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్లైఓవర్‌కు సంబంధించి దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి కావాడానికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నాటికి శ్లాబుల నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు అధికారులు సూచించారు. ఫిబ్రవరి 15 నాటికి మొత్తం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ సోమాకు ఆర్‌అండ్‌బీ ఎన్‌హెచ్ డివిజన్ అధికారులు ఆదేశాలిచ్చారు.
దుర్గగుడి దగ్గర స్పాన్- వింగ్స్ పనులకు ఆంటకం ఏర్పడింది. 11 వింగ్స్‌కు చిన్నమొత్తంలో బీటలు వారడంతో వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాగానే ఫినిషింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు మరో రెండు నెలల సమయం పడుతుంది. మొత్తంగా మరో ఐదు నెలల్లో ఫ్లైఓవర్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ సంస్థకు 90 శాతం మేర ప్రభుత్వం లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది. దసరా ఉత్సవాలు, దుర్గ భవానీ దీక్షల కారణంగా గత రెండు నెలల్లో ప్లై ఓవర్ నిర్మాణా పనులు కాస్తా నెమ్మదించాయి. మూడు స్పాన్స్ పనులు మిగిలి ఉన్నాయి. ఈ మూడు స్పాన్స్‌కు వింగ్స్‌ను ఏర్పాటు చేయాల్సివుంది. కాగా ప్రధానంగా దుర్గమాతా బాటిల్ నెక్ దగ్గర ఈ పరిస్థితి ఏర్పడడంతో పనులు ఆలస్యమయ్యాయి.
11 వింగ్స్‌కు బీటలు వారడంతో కాంట్రాక్ట్ సంస్థకు భారీ నష్టం వచ్చింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్‌వీ కన్సల్టెన్సీ సంస్థ బీటలు వారిన వింగ్స్‌ను ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది. అలాగే కొత్త వింగ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆర్‌వీ కన్సల్టేన్సీ సంస్థ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థ కొత్త వింగ్స్‌ను తయారు చేస్తోంది. క్యాస్టింగ్ డిపోలో స్పాన్‌లు తయారు చేసి ఓ పక్కగా క్రేన్లతో పెట్టే క్రమంలో వింగ్స్‌కు బీటలు వారాయి. దీంతో దుర్గగుడి మలుపు నుంచి అశోక స్తంభం వరకు పనుల్లో జాప్యం నెలకొంది. ఇప్పటి వరకు మూడు స్పాన్స్ వయాడక్ట్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
స్పాన్స్‌కు రెక్కలు తొడిగి.. స్లాబుల పోర్షన్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆర్‌అండ్‌బీ ఎన్‌హెచ్ డివిజన్ అధికారులు నిర్దేశించారు. ఫినిషింగ్ పనులు చాలా ఆలస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వై పిల్ల ర్స్ దగ్గర, స్పాన్ కాంక్రీటింగ్, క్రాష్ బ్యారియర్స్, సెంట్రల్ డివైడర్స్ , అప్రోచ్‌లపై బీటీ లేయర్స్, సెంట్రల్ లైటింగ్, రేడియం స్టిక్క రింగ్ వంటి అనేక పనులు చేయటానికి చాలా సమయం పట్టేలా ఉంది. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి బెజవాడ సిటీకి వచ్చేవారితో పాటు ఇబ్రహీపట్నం, భవానీపురంలో ఉండే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర నగరం చుట్టూ తిరిగి నగరంలోకి రావాల్సిన దుస్థితి తప్పనుంది. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ నుంచి వెళ్లే వాహనాలు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి.