తెలుగు మీడియా.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2020 1:38 PM IST
తెలుగు మీడియా.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి

కరోనా దెబ్బకు కుదేలైన రంగాల్లో మీడియా ఒకటి. మిగతా రంగాలు ఈ దెబ్బ నుంచి మళ్లీ కోలుకుని కొన్ని నెలల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయేమో కానీ.. మీడియా పరిస్థితి మాత్రం అలా లేదు. ముఖ్యంగా ప్రింట్ మీడియా.. కరోనా దెబ్బకు అల్లల్లాడిపోతోంది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న సంస్థలు.. కరోనా ధాటికి మూతపడే స్థితికి వచ్చాయి. ప్రింట్ మీడియా ద్వారా వందలు, వేల కోట్లు సంపాదించిన వాళ్లు.. ఇప్పుడు ఒకట్రెండు నెలలు కష్టాలు ఎదురయ్యే సరికి జర్నలిస్టుల జీవితాల్ని రోడ్డు మీదికి తెచ్చేస్తున్నారు. జీతాల కోతలు.. ఉద్యోగాల కోతలు.. ఇలా మొత్తంగా ప్రింట్ మీడియా సంస్థల పరిస్థితి దారుణంగా ఉంది. జీతాల కోత, ఉద్యోగ అభద్రత విషయంలో ఉన్న కష్టాలు చాలవని ఇప్పుడు కరోనా మహమ్మారి నేరుగా జర్నలిస్టుల్ని కాటేస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవలే హైదరాబాద్‌లో 140 మంది రిపోర్టర్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 30 మందికి పైగా పాజిటివ్‌గా తేలారు. వీళ్లందరూ బయట వార్తల కవరేజీ కోసం తిరిగి.. తర్వాత ఆఫీసులకు వెళ్లి పని చేసిన వాళ్లే. దీంతో వాళ్లను కాంటాక్ట్ అయిన డెస్క్ సబ్ ఎడిటర్లు, ఇతర సిబ్బందిలో ఎంతమందికి కరోనా సోకిందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే కరోనా ఉందో లేదో తెలుసుకుని.. టెన్షన్ ఫ్రీ అవ్వాలని, కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడకుండా చూసుకోవాలని జర్నలిస్టులు అనుకుంటున్నారు. కానీ వాళ్లందరికీ పరీక్షలు నిర్వహించడంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం తనకు తానుగా పరీక్షలు చేయట్లేదు. మీడియా సంస్థల నుంచి రెప్రజెంటేషన్ వస్తే పరీక్షలు చేయిస్తుంది.

ఐతే ఇలా రెప్రజెంటేషన్ ఇస్తే.. తర్వాత తమ ఉద్యోగాలు ఏమవుతాయో అన్న ఆందోళన జర్నలిస్టుల్లో నెలకొంది. ఒకవేళ ప్రభుత్వం పరీక్షలు చేసి మొత్తం సంస్థలో ఓ పది మందికో 20 మందికో కరోనా ఉందని తేలిందంటే వాళ్లతో పాటు కాంటాక్ట్ అయిన అందరినీ కొన్ని నెలల పాటు ఆఫీసుకు రానివ్వరు. అంతటితో ఆగకుండా ఆఫీసులే మూసేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అప్పుడు అందరి ఉద్యోగాలకూ ఎసరు పెట్టుకున్నట్లే. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల పాఠకులకు, పేపర్లకు కనెక్షన్ దెబ్బ తింది. పేపర్లు చదివే అలవాటు తప్పి జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా కొన్ని నెలలు పేపర్ ఆఫీసులు మూతపడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా చూస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలా వద్ద అన్న అయోమయంలో జర్నలిస్టులు కొట్టుమిట్టాడుతున్నారు.

Next Story