ఏమిటీ స్టాండర్డ్ క్యూ కోవిడ్ -19 యాంటీజన్ డిటెక్షన్ కిట్? ప్రయోజనం ఏమంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2020 7:14 AM GMT
ఏమిటీ స్టాండర్డ్ క్యూ కోవిడ్ -19 యాంటీజన్ డిటెక్షన్ కిట్? ప్రయోజనం ఏమంటే?

మాయదారి రోగానికి చెక్ పెట్టాలంటే స్వీయ నియంత్రణ ఎంత ముఖ్యమో.. అదెక్కడ తిష్ట వేసిందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. కానీ.. ఆ విషయాన్ని వదిలేసినట్లుగా వ్యవహరిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోని పలు రాష్ట్రాలు వైరస్ నిర్దారణ చర్యలు పెద్ద ఎత్తున చేయిస్తున్నా.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు గులాబీ బాస్. తెలంగాణలో ఇప్పటివరకూ ప్రభుత్వం చేసిన నిర్దారణ పరీక్షలు తిప్పి కొడితే 40 నుంచి 50 వేల మధ్య ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. విమర్శల తీవ్రత పెరుగుతోంది. ఇలాంటివేళ.. పది రోజుల వ్యవధిలో 50వేల పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఆ పరీక్షల్ని ఎలా చేయిస్తారన్నది క్లారిటీ లేదు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ఆర్ టీ- పీసీఆర్ పద్దతి ప్రకారం పరీక్ష నిర్వహించటం.. శాంపిల్ ను ల్యాబ్ కు పంపటం.. దాని ఫలితం కోసం ఐదారు గంటల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి.

ఓ పక్క కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న వేళ.. పాత పద్దతిలో కాకుండా ఫలితాన్ని కేవలం పావు గంటలో 99 శాతం కచ్ఛితత్వంతో ఫలితం వచ్చేందుకు స్టాండర్డ్ క్యూ కోవిడ్ -19 యాంటీజన్ డిటెక్షన్ కిట్ లను వాడుతున్నారు. దక్షిణకొరియాకు చెందిన కంపెనీ తయారు చేసిన ఈ కిట్లకు ఐసీఎంఆర్ ఓకే చెప్పింది. ఈ కిట్లపై ఐసీఎంఆర్ మార్గదర్శకాల్ని జారీ చేసింది. మాయదారి రోగ నిర్దారణ కోసం తెలంగాణ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే.. అనుమానిత లక్షణాలు ఉన్న వారి గొంతు నుంచి ముక్కు నుంచి తెమడను శాంపిల్ గా సేకరిస్తారు. దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి.. ల్యాబ్ కు పంపుతారు. ఐదారు గంటల వ్యవధిలో ఫలితాన్ని వెల్లడిస్తారు.

ఇందుకు భిన్నంగా కొరియాకు చెందిన పరికరంతో కేవలం పదిహేను నిమిషాల్లో ఫలితాన్ని ప్రకటించే వెసులుబాటు ఉంది. అంతేకాదు.. శాంపిల్ చేసిన చోటు నుంచి కూడా నిర్దారణ పరీక్షను పూర్తి చేసి ఫలితాన్ని అప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ఉంది. నిర్దారణ పరీక్షల విషయంలో ఆలస్యంగా నిద్ర లేచిన కేసీఆర్.. పాత పద్దతుల్ని వదిలేసి.. కొత్తగా వచ్చిన సాంకేతికతను తీసుకురావాల్సిన అవసరం ఉంది.

అనునిత్యం ప్రపంచ వ్యాప్తంగా ఏమేం జరుగుతుందన్న విషయాల్ని తెలుసుకుంటూ.. అప్డేట్ అయ్యే సీఎం కేసీఆర్ కు కొరియా కిట్ గురించి తెలుసా? అన్నది ప్రశ్న. ఒకవేళతెలిసే ఉంటే.. సమయం వేస్ట్ అయ్యే పరీక్షల విధానాన్ని పాటించాల్సిన అవసరం ఏముందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకైనా మంచిది కొరియా డెవలప్ చేసిన కిట్ల విషయాన్ని కేసీఆర్ వరకూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Next Story