వడ్లు కొనమంటే చేతకాక కేసీఆర్‌ ధర్నాలు: వైఎస్ షర్మిల

Ysrtp leader sharmila fire on TS Govt. వరి ధాన్యం కొనుగోలు చేయబోమని తెలంగాణ ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల

By అంజి  Published on  13 Nov 2021 2:18 PM IST
వడ్లు కొనమంటే చేతకాక కేసీఆర్‌ ధర్నాలు: వైఎస్ షర్మిల

వరి ధాన్యం కొనుగోలు చేయబోమని తెలంగాణ ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. పాలన చేయమని కేసీఆర్‌కు అధికారం ఇస్తే.. చేతకాక ధర్నాలు చేస్తున్నాడని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. '' ప్రభుత్వంలో ఉండి పాలకులై ఉండి.. పాలిస్తున్న రాష్ట్రంలోనే మీరు ధర్నాలు చేస్తున్నారంటే ఏమిటి అని అర్థం" అంటూ షర్మిల ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ధర్నాలు చేయడం చూశామని, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం చూశామని.. కానీ ప్రభుత్వమే ధర్నాలు చేయడం చూడలేదన్నారు.

దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని, వాళ్ల కాలర్‌ పట్టుకుని నిలదీసి.. పోరాడుకుని సాధించుకుని రావాలని అన్నారు. రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిన వ్యక్తి కేసీఆర్‌ అని షర్మిల మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేకి అని ఆమె అన్నారు. రైతు బంధు పేరుతో ఎకరాకు రూ.5 వేలు ఇస్తూ.. రైతును నట్టేటా ముంచుతున్నారని అన్నారు. పంట పండించే వరకే రైతు పని అన్న ఆమె.. ఆ తర్వాత మద్దతు ధర కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. బానిసలుగా రైతులు తమ కాళ్లు మొక్కితే తప్ప పంట కొనరా అంటూ ప్రశ్నించారు.

వరి ధాన్యం ఎందుకు కొనడం లేదో కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని షర్మిల డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రాలు బోనస్‌ ఇచ్చి మరీ వరి ధాన్యం కొంటున్నాయని ఆమె తెలిపారు. దివంగత నాయకుడు వైఎస్‌ఆర్‌ రూ.300 ఎక్కువ ఇచ్చి సన్న బియ్యం కొన్నారని షర్మిల గుర్తు చేశారు. రైతుకు కనీస ధర ఇస్తామని చెప్పి.. ధాన్యం కొనకపోతే అది రైతులను మోసం చేసినట్లేనన్నారు. రైతులపై తెలంగాణ ప్రభుత్వం భారం మోపుతోందన్నారు. వడ్లు కొనుగోలు తరుగు పేరుతో కోత విధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సివిల్ సప్లయ్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ను బయటపెట్టాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

Next Story