వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటు వేసిన వైసీపీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా, తాజాగా వైసీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది.
ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తమిళగ వెట్రీ కజగం అధ్యక్షుడు, సినీనటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. ఇప్పటికే దీనిపై 10 పిటిషన్లు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ 16 విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.