గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, కొత్త బోర్డు వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. దేశంలోనే ఒక కమిషన్ లో జరిగిన అతిపెద్ద స్కాం అని.. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్మి 30లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడారని అన్నారు. ఈ పేపర్ లీకుల వెనుక బోర్డ్ చైర్మన్, మెంబర్లు, ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందని అన్నారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదని.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఈ కేసులో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పేపర్లు లీక్ చేశారని, మరెవరి ప్రమేయం లేదని కేసును మూసివేసే కుట్ర జరుగుతోందన్నారు. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆ ఇద్దరు వ్యక్తులే పేపర్ లీక్ చేశారని జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారని అన్నారు. దర్యాప్తుకు ముందే దోషులు ఎవరనేది తేల్చేశారని అన్నారు. పాత్రధారులను మాత్రమే దోషులుగా తేలుస్తూ సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు సాగుతోందని విమర్శించారు. ఈ కేసును నీరు గార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు.