చిత్తశుద్ధి ఉంటే మీ సీటు మహిళకు ఇవ్వండి కేటీఆర్ గారూ..! : షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు సంధించారు.
By Medi Samrat Published on 20 Sep 2023 12:00 PM GMTవైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు సంధించారు. మహిళా రిజర్వేషన్లతో తన సీటు కోల్పోయినా సిద్ధమే అని చెప్పే కేటీఆర్.. బిల్లు అమలయ్యేదాకా ఎదురుచూడటం ఎందుకు.?ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండి. మిమ్మల్ని అడ్డుకునేదెవరు అని వ్యాఖ్యానించారు. నిజంగా మహిళల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే.. మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు మీ పోరాట ఫలితమే అయితే.. ఈ ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట వేయండి.. మీ సీటు మహిళకు ఇవ్వండని డిమాండ్ చేశారు. మీ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించండని అన్నారు. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపండని కోరారు.
మహిళలను దారుణంగా అవమానించిన మీరే ఈ రోజు మహిళల గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల కోసం మేం దీక్షలు చేస్తే వ్రతాలంటూ ఎద్దేవా చేసింది మీరే.. మహిళా మంత్రులు లేకుండా చేసింది మీరేనన్నారు. మహిళా కమీషన్ ఉందన్న సంగతే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. శ్రీకాంత చారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవి ఇవ్వలేదని దుయ్యబట్టారు. మీ చెల్లి కవితమ్మ ఓడిపోతే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారు. మీకున్నది మహిళల మీద ప్రేమ కాదు.. మీ కుటుంబం మీద ప్రేమ అని విమర్శించారు.
మీకు సామాన్య ప్రజల్ని ప్రేమించే సత్తాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటలతో చిత్తశుద్ధి నిరూపణ కాదు.. చేతలతోనే అవుతుందని అన్నారు. 119 నియోజకవర్గాల్లో 63 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువని ఎన్నికల సంఘం చెప్తోంది. 33 శాతం లెక్కన ఈ ఎన్నికల్లో మీరిచ్చిన 7 సీట్లతో పాటు మరో 32 సీట్లు ఇవ్వండని డిమాండ్ చేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మహిళల ఓట్లే అధికం కాబట్టి.. దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయండని.. అప్పుడు నమ్ముతాం.. మహిళా బిల్లు మీ పోరాట ఫలితమేనని.. మహిళల పట్ల మీకు ఎంతో చిత్తశుద్ధి ఉందని..! మీవి అవకాశవాద రాజకీయాలు కాదని.. దమ్ముంటే కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించాలని అన్నారు.