ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను ప్రజల్లోకి వెళ్లడం ఆపేదే లేదని అన్నారు. పాదయాత్రకు అనుమతి కోసం మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ప్రజాసమస్యలపై అధికారపార్టీ ఎమ్మెల్యేలను తాను నిలదీయడం తప్పా..? అని ప్రశ్నించారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నాయకుల్లో భయం పట్టుకుందన్నారు. అధికార దాహంతో బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారని భావిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై త్వరలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. తనకు, తన పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక బీఆర్ఎస్ నేతలు మాపై విమర్శలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎమెల్యేలు, మంత్రులపై విచారణ జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలపై తాను మాట్లాడుతున్నాను కాబట్టే ఇవన్నీ చేస్తున్నారని ఆమె అన్నారు.