బీఆర్ఎస్ నేతలపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై, మీడియాపై కూడా బీఆర్ఎస్ నేతలు దాడి చేశారన్నారు. నిజాలను చెబితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అక్రమాలకు పాల్పడం లేదా, ఆయన ఏ1 కాంట్రాక్టర్ కాదా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడటమే తమ తప్పా అంటూ నిలదీశారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనపై దాడులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి, ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజా సేవ చేయాలనే సోయి బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదన్నారు. బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదని అన్నారు. మీ దాడులకు రెట్టింపు స్థాయిలో మీ అవినీతిని ప్రశ్నిస్తామన్నారు. దాడిపై పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తున్న షర్మిలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అనుచరులు అడ్డుకున్నారు. వైఎస్ షర్మిల పాదయాత్రకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు చించి వేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.