బీఆర్ఎస్ కు కొత్త నిర్వచనం చెప్పిన యోగి ఆదిత్యనాథ్

బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా

By M.S.R  Published on  25 Nov 2023 3:00 PM GMT
బీఆర్ఎస్ కు కొత్త నిర్వచనం చెప్పిన యోగి ఆదిత్యనాథ్

బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు వేములవాడలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి ఎజెండా ఒక్కటేనని.. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారి ప్రజలను మోసం చేసిందని యూపీ సీఎం మండిపడ్డారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటే బ్రస్టా చార్ పార్టీ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు.

తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ ఉందని.. కొందరితో జతకట్టి మోసం చేస్తుందన్నారు. గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం పేరిట పార్టీలు మోసం చేశాయని, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాయని యోగి ఆరోపించారు. భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉందని.. అది నరేంద్ర మోదీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ రైతులు, సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు యోగి ఆదిత్యనాథ్.

Next Story