CM Revanth vs Harish Rao : రాజీనామా లేఖ అలా ఉండదు.. హరీష్‌కు సీఎం కౌంటర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అని కౌంటరిచ్చారు
By Medi Samrat Published on 26 April 2024 12:38 PM ISTబీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అని కౌంటరిచ్చారు. హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం.. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు.. రాజీనామా లేఖ అలా ఉండదని ఎద్దేవా చేశారు.
హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని అన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని.. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని అన్నారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని ఎద్దేవా చేశారు. హరీష్.. ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో అని కౌంటరిచ్చారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేరుకున్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసంచేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు సీఎం రావాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలిసి హరీశ్ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్నారు. హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని చెప్పారు. అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలన్నారు. రాజీనామాకు ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లేనని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడమే తమ కర్తవ్యమని వెల్లడించారు.