రాజస్థాన్‌లోని జైసల్మేర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్ భార్య మృతి చెందారు. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్‌తో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. గోవింద్ సింగ్, ఆయన భార్య, మరో ఇద్దరు సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు తనోత్ మాతా ఆలయాన్ని సందర్శించి రామ్‌గఢ్‌కు వెళ్తున్నారు. నివేదికల ప్రకారం.. తనోత్ మాతా దేవాలయం, రామ్‌ఘర్ మధ్య మార్గంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది క్షతగాత్రులను రామ్‌ఘడ్‌లోని సమీప కమ్యూనిటీ హెల్త్ కేర్ కి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోవింద్ సింగ్ భార్య చనిపోయినట్లు నిర్ధారించారు. గోవింద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన డ్రైవర్ విజేంద్రతో పాటు ప్రమాదంలో మరొక వ్యక్తి గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.