'మెగా డీఎస్సీ ఎక్కడ?'.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఆన్‌ ఫైర్‌

సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ లో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. ''మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు'' అంటూ ప్రశ్నించారు.

By అంజి  Published on  9 July 2024 11:30 AM GMT
Mega DSC , BRS, KTR ,CM Revanth, Telangana

'మెగా డీఎస్సీ ఎక్కడ?'.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఆన్‌ ఫైర్‌

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ లో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. ''మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు'' అంటూ ప్రశ్నించారు. తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? అంటూ నిలదీశారు.

''తొమ్మిది నెలలు కావస్తున్నా లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన, మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా? మీరు కొలువుదీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా ?? గతంలో మీరు.. ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు. తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారు'' అంటూ సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

''అధికారంలోకి వచ్చాక.. నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు. డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారు. వందల మందిని అన్యాయంగా అరెస్టుచేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు'' అని కేటీఆర్ అన్నారు.

''గుర్తుపెట్టుకోండి.. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు. మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం, మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు. నిత్యం పోలీసుల బూట్లచప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నరు. డీఎస్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది'' అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Next Story