'అమృత్‌'లో అవినీతి జరుగుతుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ స్కీం అమృత్‌ టెండర్ల అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

By అంజి  Published on  12 Nov 2024 1:01 PM IST
PM Modi, corruption, Amrit scheme, KTR, Telangana

'అమృత్‌'లో అవినీతి జరుగుతుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ స్కీం అమృత్‌ టెండర్ల అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. రూ.8,888 కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని కోరారు. అడ్రస్‌, అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారని, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీజేపీ అంటోందని, దీనిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిల పదవులు పోవడం ఖాయమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

అధికార దుర్వినియోగం చేసిన సోనియాతో సహా చాలా మంది పదవులు కోల్పోయారని ఉదహరించారు. తాము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్‌ నేతలకు భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో వసూళ్లు, బెదిరింపులు పెరిగాయని ఆరోపించారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ ఉందని మోదీనే చెప్పారన్నారు. రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని కేటీఆర్‌ నిలదీశారు.

ప్రధానమంత్రి తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడడం కాదని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్ఆర్ టాక్స్ సంబంధించి ఆరోపణలు చేయడం కాదని, వెంటనే తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆధారాలతో సహా తెలంగాణ అమృత్ టెండర్లలో జరుగుతున్న అవినీతిపైన ఫిర్యాదు చేసిన తర్వాత ప్రధానమంత్రి స్పందిస్తారో లేదో చూడాలన్నారు.

అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులకు టెండర్లు ఇచ్చారని, ఒకవేళ అమృత్ టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటే అదే మాటను బిజెపి నేతలు ప్రధానమంత్రి దేశానికి చెప్పాలన్నారు. కానీ అవినీతి జరుగుతున్న మౌనంగా ఉండి.. చర్యలు తీసుకోకుండా ఉండడం అన్యాయమన్నారు. తెలంగాణలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎండగడతామన్నారు. క్రోనీ క్యాపిటలిజం గురించి ఢిల్లీలో మాటలు చెబుతున్న రాహుల్ గాంధీని నిలదీస్తామన్నారు.

నిన్న అమృత్ టెండర్ల పైన ఫిర్యాదు చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్ కట్టర్ ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కేటీఆర్‌ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల వరకు సమయం ఇవ్వండి, సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ పార్లమెంటు సమావేశాల లోపల కేంద్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో జరిగిన అవినీతిపైన స్పందించకుంటే పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని కేటీఆర్‌ తెలిపారు.

తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ కలిసి ఉన్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రిపైన వచ్చే ప్రతి విమర్శకు బిజెపి కెంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి కాపాడుతున్నారని, 8 మంది ఎంపిలున్నా ఇప్పటిదాకా 11 నెలలలో ఒక్కరు కూడా ప్రభుత్వ అవినీతిపైన మాట్లాడలేదన్నారు.

Next Story