మొదలైన వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
By Medi Samrat
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొండాపూర్, మియాపూర్, చందానగర్, ఆర్సీపూరం, లింగంపల్లి, బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వడగళ్ల వానలు, భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
సోమవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని.. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లిలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో సోమవారం నుంచి మంగళవారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో బుధవారం నుంచి గురువారం వరకు ఇలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.