భారత్ జోడో గర్జనను విజయవంతం చేయాలి : రేవంత్ రెడ్డి

We should make Bharat Jodo Garjana a grand success. దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్ల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు రాహుల్ గాంధీ

By Medi Samrat  Published on  6 Nov 2022 10:35 AM GMT
భారత్ జోడో గర్జనను విజయవంతం చేయాలి : రేవంత్ రెడ్డి

దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్ల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కన్యాకుమారి నుంచి చేపట్టిన ఈ యాత్ర కర్ణాటక మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. జోడో యాత్ర రేపు రాత్రి తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ గడ్డ మీద జోడో యాత్ర నిర్వహించినందుకు కృతజ్ఞతగా ఘనంగా విడ్కోలు పలికేందకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో భారత్ జోడో గర్జన సభను నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు.

తెలంగాణలో జోడో యాత్ర అద్భుతంగా సాగింది. తెలంగాణ సమాజం ఈ యాత్రను విజయవంతం చేసింది. కర్షకులు, కార్మికులు, మేధావులు అందరూ ఈ యాత్రలో పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించారు. ఉదయం 6 గంటలకు మొదలయ్యే యాత్రలో రాహుల్ గాంధీ సాయంత్రం ముగిసే వరకు విసుగు విరామం లేకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం, దేశం కోసం ప్రాణాల్పరించిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేపట్టారు. ఈడీ, సీబీఐ దాడులు చేసినా, ప్రాణాలకు ప్రమాదం ఉందని నిఘూ వర్గాలు హెచ్చరించిన రాహుల్ వెనకడుగు వేయలేదని అన్నారు.

ఎన్నికలు, ఓట్ల కోసం కాకుండా దేశ విశాల ప్రయోజనాల కోసం ఈ పాదయాత్ర చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో అధికారం పోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం 60 ఏళ్ల తెలంగాణ కలను సోనియా గాంధీ సాకారం చేశారు. సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి జెండాలు, ఎజెండాలకు, రాజకీయాలకు అతీతంగా మనం మద్దతు ఇవ్వాలి. దేశం మనుగడ ప్రమాదంలో పడింది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అవినీతితో కుళ్లి, కృశించి పోయింది. ఇటువంటి చీకటిలో చిరుదివ్వెలా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. అందుకే ప్రజలంతా భారత్ జోడో యాత్రకు మద్దతుగా కదలిరావాలి. రేపు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కదలి వచ్చి మెనూరులో సాయంత్రం 4 గంటలకు జరిగే కృతజ్ఞత సభ ను విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణలో 119 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. పాదయాత్ర మహారాష్ట్రలో ప్రవేశించే సమయంలో తెలంగాణ సమాజం మొత్తం రాహుల్ గాంధీ వెంట ఉందని తెలిసేలా ప్రజలు కదిలి రావాలి. దేశంలోనే జోడో యాత్ర తెలంగాణలో అద్భుతంగా సాగిందని అనుకునేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సమాజహితం కోసం మీడియా మిత్రులు కూడా రాహుల్ పాదయాత్రలో కదం కదం కలపండి. మునుగోడు పూర్తి ఫలితాలు వచ్చాకే నేను, సీఎల్పీ లీడర్, ముఖ్యనేతలు ఆ విషయంపై, తెలంగాణ సమస్యలపై స్పందిస్తామ‌ని తెలిపారు. భవిష్యత్ లో భారత్ జోడో యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. పీసీసీ అధ్యక్షుడుగా యాత్రలో పాల్గొనడం నాకు దేవుడిచ్చిన వరం అని పేర్కొన్నారు.
Next Story
Share it