వరంగల్ ఎయిర్‌పోర్టు క్రెడిట్.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
వరంగల్ మహా నగరంలో ఏర్పాటు కానున్న మామునూరు ఎయిర్ పోర్ట్ క్రెడిట్‌పై వివాదం తలెత్తింది. తమదే ఈ క్రెడిట్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
By అంజి Published on 1 March 2025 2:19 PM IST
వరంగల్ ఎయిర్‌పోర్టు క్రెడిట్.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
వరంగల్ మహా నగరంలో ఏర్పాటు కానున్న మామునూరు ఎయిర్ పోర్ట్ క్రెడిట్‌పై వివాదం తలెత్తింది. తమదే ఈ క్రెడిట్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా నిన్న ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ రోజు మమూనూర్ ఎయిర్ పోర్టు ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ పోర్ట్ క్రెడిట్ మాదంటే మాది అంటూ బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు నిర్వహించారు. ఎయిర్ పోర్ట్ కోసం క్రెడిట్ వార్ కు కాంగ్రెస్, బిజెపి ఘర్షణకు దిగారు. మామునూరు ఎయిర్పోర్ట్‌కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బిజెపి ఆధ్వర్యంలో వేరు వేరుగా సంబరాలు నిర్వహించారు. ఒకే సమయంలో ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్దకు కాంగ్రెస్, బిజెపి నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ రావడానికి ప్రధాని మోడీనే కారణం అంటూ... బిజెపి నేతలు, కార్యకర్తలు ప్రధాని మోడీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అక్కడకు చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అదే చోట పాలాభిషేకం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్ ఆమోదానికి కారణం ప్రధానమంత్రి అంటూ బిజెపి కార్యకర్తలు వాదించగా... కాదు సీఎం రేవంత్ రెడ్డి కారణంగానే వరంగల్ ఎయిర్పోర్ట్ కు ఆమోదం లభించింది అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వాదించారు. ఇలా రెండు వర్గాల నేతలు,కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగుతూ పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమే ఇరు వర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.